ముడి చమురు బ్యారెల్‌ ధర 30 డాలర్లకు పడిపోవచ్చు

ముడి చమురు బ్యారెల్‌ ధర 30 డాలర్లకు పడిపోవచ్చు
వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర 30 డాలర్లకు పడిపోవచ్చని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌, విత్త సేవల సంస్థ జెపి మోర్గాన్‌ అంచనా వేసింది. ప్రపంచ ఇంధన మార్కెట్‌లో పెను మార్పులకు అవకాశం ఉందని సంచలన ప్రకటన చేసింది.  డిమాండ్‌ను మించి సరఫరా విపరీతంగా పెరగడంతో 2027 మార్చి నాటికి చమురు బ్యారెల్‌ ధరలు భారీగా పడిపోవచ్చని విశ్లేషించింది.
చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌ లాంటి దేశాలకు మంచి పరిణామమని తెలిపింది. మంగళవారం బ్యారెల్‌ ముడి చమురు ధర 61.23 డాలర్లుగా పలికింది. దీంతో పోల్చితే వచ్చే రెండేళ్లలో సగానికి పడిపోనుందని తెలుస్తోంది. జెపి మోర్గాన్‌ రిపోర్ట్‌ ప్రకారం రాబోయే మూడేళ్లలో చమురు వినియోగం స్థిరంగా పెరుగుతున్నప్పటికీ, చమురు ఎగుమతియేతర దేశాల ఉత్పత్తిదారుల నుండి అదనపు సరఫరా మార్కెట్‌ను ముంచెత్తనుంది. ఇది ధరలపై ఒత్తిడిని కలిగించనుంది.
2025లో ప్రపంచ చమురు డిమాండ్‌ రోజుకు 0.9 మిలియన్‌ బ్యారెల్స్‌ మేర పెరిగి, మొత్తం వినియోగం 105.5 మిలియన్‌ బ్యారెల్స్‌గా నమోదు కావొచ్చని అంచనా. 
2026లో ఇదే పెరుగుదల కొనసాగి, 2027లో 1.2 మిలియన్‌ బ్యారెల్స్‌కు చేరొచ్చు. అయితే.. ఈ డిమాండ్‌ వృద్ధి కంటే సరఫరా ఎక్కువగా ఉంటుంది. 2025, 2026లలో డిమాండ్‌ కంటే సరఫరాలో పెరుగుదల మూడు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
నాన్‌ ఒపెక్‌ప్లస్‌ దేశాల నుండి పెరుగుతున్న ఉత్పత్తి భారీ స్థాయిలో ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని జెపి మోర్గాన్‌ తెలిపింది.  2027 నాటికి అంచనా వేసిన అదనపు సరఫరాలో సగం ఈ కూటమి వెలుపలి నుండే వస్తుందని తెలిపింది. సముద్ర తీరం ప్రాజెక్టులు, గ్లోబల్‌ షేల్‌ ఉత్పత్తి దీనికి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. అధిక సరఫరా పెరుగుదల కారణంగా పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోనున్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిల్వలు పెరిగాయని, తక్షణ జోక్యం లేకపోతే, ఈ మిగులు 2026లో రోజుకు 2.8 మిలియన్‌ బ్యారెల్స్‌, 2027లో రోజుకు 2.7 మిలియన్‌ బ్యారెల్స్‌కు పెరుగొచ్చని తెలిపింది.  స్వచ్ఛందంగా లేదా అనుహ్యాంగా ఉత్పత్తి కోతలు జరిగితే మార్కెట్‌ తిరిగి సమతూల్యం కావచ్చని పేర్కొంది. 2026కి తమ బ్రెంట్‌ చమురు అంచనాను 58 డాలర్లుగా తెలిపింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా దిగివస్తోన్నప్పటికీ భారత్‌లో మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దిగిరాకపోవడం గమనార్హం.