భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం రాజ్యాంగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. బుధవారం డిల్లీ సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాక్రిష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు, ఒడియా, అస్సామీస్, కశ్మీరీ, బోడో, పంజాబీ, నేపాలీ, మరాఠీ, మళయాలం భాషల్లో ప్రచురించిన భారత రాజ్యాంగ గ్రంధం డిజిటల్ వర్షన్లను ఈ సందర్భంగా రాష్ట్రపతి విడుదల చేశారు. భారత్ కే సంవిధాన్ మే కళా ఔర్ కాలిగ్రఫీ శీర్షికతో ఒక స్మారక బుక్లెట్ను రిలీజ్ చేశారు. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అని ఆమె స్పష్టం చేశారు. శాసనాల్లో ఎన్ని మార్పులు చేసినా రాజ్యాంగానికి లోబడి ఉన్నామని తెలిపారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని, అందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చినట్లు రాష్ట్రపతి చెప్పారు. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని, ఆర్థిక ఏకీకరణలో భాగంగా జీఎస్టీ వ్యవస్థను తీసుకొచ్చామని ఆమె గుర్తు చేశారు.
వలసవాద మనస్తత్వాన్ని త్యజించి, జాతీయతావాద ఆలోచనా వైఖరి దిశగా పౌరులను నడిపే గొప్ప గ్రంధం రాజ్యాంగం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. మహిళలు, యువత, ఎస్సీలు, ఎస్టీలు, రైతులు, మధ్యతరగతి, కొత్తగా మధ్యతరగతిలో చేరుతున్న వారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని రాష్ట్రపతి తెలిపారు. ఇటీవలి కాలంలో 25 కోట్ల మంది భారతీయులను దారిద్య్ర రేఖ నుంచి బయటికి తీసుకురావడం అనేది భారతదేశ గొప్ప విజయమని ఆమె కొనియాడారు.
“1949 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున (నవంబరు 26), ఇదే భవనం(రాజ్యాంగ సభ సెంట్రల్ హాల్) వేదికగా భారత ప్రజలు రాజ్యాంగాన్ని ఆమోదించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, కొంతకాలం పాటు తాత్కాలిక పార్లమెంటుగానూ రాజ్యాంగ సభ సేవలు అందించింది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్గా బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వ్యవహరించారు. ఆయనే మన రాజ్యాంగ ప్రధాన రూపకర్త” అని రాష్ట్రపతి గుర్తు చేశారు. దేశ ప్రజల వ్యక్తిగత, ప్రజాస్వామిక హక్కులకు సదా రక్షణ లభించాలని భారత రాజ్యాంగ రూపకర్తలు కోరుకున్నారని రాష్ట్రపతి ముర్ము చెప్పారు.

More Stories
రాజ్యాంగ విధులను నిర్వర్తించండి
శతాబ్దాలుగా మార్గం ఏర్పర్చిన గురు తేజ్ బహదూర్ బలిదానం
ఎస్ఐఆర్ పై బిజెపి దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం