భూ బకాసురుల రాజ్యంకు హిల్ట్ పాలసీ నిదర్శనం

భూ బకాసురుల రాజ్యంకు హిల్ట్ పాలసీ నిదర్శనం
 
* “సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూఠీ” ఉద్యమం త్వరలో
తెలంగాణ రాష్ట్రంలో భూ బకాసురుల రాజ్యం ఏలుతుందనటానికి హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఒక నిదర్శనం అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి రోజుకో స్కాంకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టేది పోయి, స్కాంలు, కుంభకోణాలపై శ్రద్ధ ఉందని మండిపడ్డారు.
రాష్ట్ర కేబినెట్ సమావేశంలో  ఈ జిఓ నెంబర్ 27 హిల్ట్ పాలసీని ఉపసంహరించుకోకపోతే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ రూపొందించి, ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.  ఇష్టానుసారంగా రాత్రికి రాత్రి జిఓలు తీసుకొచ్చి రాష్ట్ర సంపదను లూఠీ చేయాలని ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు.  తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, ఈ హిల్ట్ పాలసీపై చర్చ జరపాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగుతుందని  ఆయన ధ్వజమెత్తారు. 
 
రాష్ట్రంలో  డెమోక్రసీ స్థానంలో క్లెప్టోక్రసి వచ్చిందని పేర్కొంటూ క్లెప్టోక్రసి అంటే అధికారంలో ఉంది  ప్రజా సంపదను లూఠీ చేసే దొంగలని అర్థమని చెప్పారు. ఇలా రాష్ట్రంలో క్లెప్టోక్రసి పాలన నడుస్తుందని దుయ్యబట్టారు. “సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూఠీ” అనే ఉద్యమం త్వరలో వస్తుందని ఆయన హెచ్చరించారు.  కేబినెట్ మంత్రులకు ఇందులో వాటా లేకుంటే ఒక్కరైనా స్పందించే వారని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డితో సహా మొత్తం కేబినెట్ మంత్రులకు ఈ కుంభకోణంలో వాటా ఉందని ఆయన తెలిపారు.
గత పాలకులు కిటికీలు తెరిస్తే వీళ్ళు దర్వాజా తెరిచినట్లు, బిఆర్ఎస్ పాలనలో వందల ఎకరాలు లూఠీ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వేల ఎకరాల భూమి లూఠీ చేసి తద్వారా లక్షల కోట్లు అవినీతి చేసే యోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్లు ఆయన ఆరోపించారు.  మంత్రి శ్రీధర్ బాబుకు తెలియకుండానే సీఎం రేవంత్ రెడ్డి ప్యాలెస్ లో కూర్చుండి ఈ పాలసీని డిజైన్ చేసినట్లు కనిపిస్తోందని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి చెందిన అనుచరులు ముందుగానే ఈ 22 వాడల్లోకి వెళ్ళి 9292 ఎకరాల భూమిని రెక్కీ చేసి ముందే అగ్రిమెంట్లు చేసుకున్నది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.