భారత నౌకాదళం అమ్ముల పొదిలో ‘ఐఎన్ఎస్ మాహె’

భారత నౌకాదళం అమ్ముల పొదిలో  ‘ఐఎన్ఎస్ మాహె’
భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. తొలి యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌ షాలో ఏఎస్డబ్ల్యూఎస్ వాటర్‌ క్రాఫ్ట్‌ ‘ఐఎన్ఎస్ మాహె’ నౌకాదళంలో చేరింది. ముంబయిలోని నావల్‌ డాక్‌యార్డ్‌లో ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ ముఖ్య అతిధిగా ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మాహే భారత జలాల్లోకి ప్రవేశించింది.
ఈ కార్యక్రమంలో నౌకాదళానికి చెందిన సీనియర్‌ అధికారులు, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ – షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ (ఎఎస్‌డబ్ల్యూ-ఎస్‌డబ్ల్యూసి)లో మొదటిదైన ఈ ఐఎన్‌ఎస్‌ మాహేను కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సిఎస్‌ఎల్‌) నిర్మించింది.  కొచ్చిన్‌ షిప్‌యార్డులో నిర్మించిన ఐఎన్ఎస్ మాహెలో 80 శాతం స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. సైలంట్‌ హంటర్‌గా పిలిచే ఈ నౌక పశ్చిమ సీబోర్డు ఆధీనంలో కార్యకలాపాలు సాగించనుంది.

“మలబార్‌ తీరంలోని చారిత్రక పట్టణం మాహె పేరును ఈ నౌకకు పెట్టారు. దీని పైభాగంలో ఉరుమి అనే ఆయుధాన్ని ఏర్పాటు చేశారు.ఇది కలరిపయట్టులో ఉపయోగించే పొడవైన, సన్నని కత్తి. చురుకుదనం, కచ్చితత్వం, యుద్ధ సమర్థతను ఇది సూచిస్తుంది. ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్ఠం కానుంది” అని జనరల్ ఉపేంద్ర తెలిపారు. 

“జలాంతర్గాములను వేటాడేందుకు, తీర ప్రాంతంలో గస్తీ నిర్వహించేలా ఐఎన్ఎస్ మాహెను అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు. సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ జలాంతర్గామి పాల్గోనుంది” అని చెప్పారు.  ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్‌క్రాఫ్ట్‌ నీటిలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. శత్రు జలాంతర్గాములు దీని రాకను గుర్తించలేవు. అందుకే దీన్ని సైలెంట్‌ హంటర్‌గా పిలుస్తారు.

ఇందులోని సోనార్‌ సిస్టమ్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. శత్రు జలాంతర్గాములు, మైన్స్‌, సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు అత్యంత కీలకం.  డీఆర్డీఓ అభివృద్ది చేసిన అభయ్‌ హల్‌-మౌంటెడ్‌ సోనార్‌ వ్యవస్థను ఇందులో ఉపయోగించారు. తద్వారా నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించే అవకాశం ఉంటుంది. జలాంతర్గాముల శబ్ధాలు, వాటి కదలిలకను ఇది వేగంగా గుర్తిస్తుంది.

ఇందులోని ‘లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్‌ డెప్త్‌ సోనార్‌’ వ్యవస్థ సాయంతో సముద్రంలో చాలా లోపలి వరకు నిఘా పెట్టే అవకాశం ఉంది. ఈ నౌక నుంచి ఓ కేబుల్‌ విడిపోయి సముద్ర గర్భంలో శత్ర ముప్పును పసిగడుతూ ఉంటుంది.