10 వేల ఏళ్ల తర్వాత పేలిన ఇథియోపియాలోనిఅగ్నిపర్వతం

10 వేల ఏళ్ల తర్వాత పేలిన ఇథియోపియాలోనిఅగ్నిపర్వతం
 
* బూడిద, పొగ ఉత్తర భారత్ కు విస్తరించే అవకాశం

ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఓ అగ్నిపర్వతం దాదాపు 10 నుంచి 12 వేల ఏళ్లలో తొలిసారిగా బద్ధలైంది. ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున బూడిదతోపాటు పొగలు వెలువడుతున్నాయి. ఇవి నింగిలో వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమాన రాకపోకలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కేరళలోని కన్నూర్‌ నుంచి అబుధాబీకి బయల్దేరిన విమానాన్ని మార్గంమధ్యలో అహ్మదాబాద్‌కు దారిమళ్లించారు.

హేలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ ఉత్తర భారతదేశానికీ విస్తరించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.  గుజరాత్​తో పాటు రాజస్థాన్​, ఢిల్లీ, పంజాబ్​ రాష్ట్రాలపై దీని ప్రభావం కనిపించనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతం మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పౌర విమానయానశాఖ అధికారులు, విమానయాన సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఇథియోపియాలోని అఫార్‌ ప్రాంతంలో ఉంది. ఇది అత్యంత చురకుగా ఉండే ఎర్టా ఎలే అగ్నిపర్వత శ్రేణిలో అత్యంత దక్షిణాన ఉన్న అగ్నిపర్వతం. భౌగోళికంగా చూస్తే, ఇది టెక్టోనిక్​ ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్న ‘రిఫ్ట్​ వ్యాలీ’ జోన్​లో ఉంది. గత 10-12 వేల సంవత్సరాల్లో ఇది పేలినట్లు దాఖలాలు లేవు. అయితే నవంబర్​ 23న జరిగిన ఈ భారీ విస్ఫోటాన్ని స్థానిక చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మారుమూల ప్రాంతం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. అగ్నిపర్వతం నుంచి పెద్దఎత్తున వెలువడిన బూడిద, పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్, పాకిస్థాన్​​ వైపుగా విస్తరించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.  దీని మాగ్మా కదలికలను శాస్త్రవేత్తలు ఉపగ్రహాల సాయంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలిన నేపథ్యంలో డీజీసీఏ సోమవారం విమానయాన సంస్థలకు, విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల ప్రణాళిక, రూటింగ్​, ఇంధన అవసరాలను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.

అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన మేఘాలు భారత్​లోని పశ్చిమ ప్రాంతాలవైపు కదులుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. దీనితో అకాశ ఎయిర్, ఇండిగో మొదలైన విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ సర్వీసులను రద్దు చేశాయి. ‘2025 నవంబర్​ 24, 25 తేదీల్లోని జెడ్డా, కువైట్​, అబుదాబికి వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశామని’ ఆకాశ ఎయిర్​ తెలిపింది. మరోవైపు డచ్ క్యారియర్ కేఎల్​ఎం ఆమ్​స్టర్​డామ్​- ఢిల్లీ విమానాన్ని రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.