బురఖాలను నిషేధించాలంటూబురఖాతో ఆస్ట్రేలియా సెనెటర్

బురఖాలను నిషేధించాలంటూబురఖాతో ఆస్ట్రేలియా సెనెటర్

బురఖాలను నిషేధించాలంటూ ఆస్ట్రేలియా పచ్చిమితవాద సెనెటర్‌ పౌలిన్‌ హన్సన్‌ బురఖా ధరించి సెనెట్‌లోకి ప్రవేశించారు.  దీంతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సెనెట్‌లో గంటపాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా బురఖాను నిషేధించాలని గత కొంతకాలంగా హాన్సన్‌ వాదిస్తున్నారు. 

బహిరంగంగా బుర్ఖా సహా ఇతర ముస్లిం దుస్తులను నిషేధించే బిల్లును ప్రవేశపెట్టేందుకు  సోమవారం  ఆమె  యత్నించారు. సెనెట్  అనుమతి నిరాకరించిన కొద్ది సేపటికే  ఆమె బురఖాను ధరించారు. బురఖాను తొలగించాలని సెనెట్‌ అధ్యక్షుడు కోరగా  ఆమె నిరాకరించారు. దీంతో  ఆమెను బయటకు వెళ్లాలని, రోజంతా సమావేశంలో పాల్గొనకుండా  నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఆమె జాత్యాహంకార సెనెటర్‌ అని, స్పష్టంగా జాత్యహంకారాన్ని ప్రదర్శించారని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రానికి చెందిన గ్రీన్స్‌ సెనెటర్‌ మెహ్రీన్‌ ఫరూకి విమర్శించారు. ఈ చర్యను ”అవమానకరమైనది”గా పశ్చిమ ఆస్ట్రేలియాకి చెందిన స్వతంత్ర సెనెటర్‌ ఫాతిమా పేమాన్‌ అభివర్ణించారు.  పెన్నీ వాంగ్‌, ప్రతిపక్ష సంకీర్ణ కూటమి డిప్యూటీ నేత అన్నె రూస్టన్‌లు ఈ చర్యను ఖండించారు. 

ఆమె ఆస్ట్రేలియా సెనెట్‌ సభ్యురాలిగా అర్హురాలు  కాదని పేర్కొన్నారు. ఆమెను సస్పెండ్‌ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హన్సన్‌ సెనెట్‌లో  బురఖా ధరించడం ఇది రెండవసారి. దేశవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ 2017లోనూ పార్లమెంటులో బురఖా ధరించారు.