ఆయోధ్య రామమందిర నిర్మాణం సంపూర్ణం.. నేడే ధ్వజారోహణం

ఆయోధ్య రామమందిర నిర్మాణం సంపూర్ణం.. నేడే ధ్వజారోహణం

అయోధ్యలో దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయ నిర్మాణం సంపూర్ణం కావడంతో చివరగా ధ్వజారోహణం మంగళవారం జరగనుంది. ధ్వజారోహణం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఆలయం పూర్తైందని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమమని శ్రీ రామ జన్మ భూమి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు.  ఇప్పుడు రాముడితో పాటు హనుమాన్, సీత సహా ఆయన కుటుంబం సైతం మొదటి అంతస్థులో ప్రతిష్ఠాపన జరగనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల్లో వీఐపీలు మాత్రమే ఉండరని, వివిధ వర్గాలకు చెందిన భక్తులు ఉంటారని చెప్పారు. ఇప్పటి వరకు ఆహ్వానించని వారిని ముఖ్యంగా రాముడికి సాయం అందించిన వర్గాలకు సంబంధించిన వారిని పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.  2025 డిసెంబర్​ నాటికి ఆలయం మినహా మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయోధ్య రామ్​లల్లా ఆలయ 191 అడుగుల శిఖరంపైన ప్రతిష్ఠించిన కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగరవేయనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. 

రామ్‌లల్లా ఆలయంపై ఎగరనున్న కాషాయ ధ్వజం త్రిభుజాకారంలో ఉండనుంది. ఈ జెండాపై రాముడి తేజస్సు, శౌర్యం సూచించేలా సూర్యుడు, కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉండనున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. గౌరవం, ఐక్యతను కాషాయ రంగు ప్రతిబింబించనున్నట్టు వెల్లడించింది.  ఈ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను అలంకరించారు.

కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి మార్గదర్శకత్వంలో అయోధ్య, కాశీ, దక్షిణాది నుంచి వచ్చిన 108 మంది ఆచార్యులు ఈ ఆధ్యాత్మిక క్రతువును నిర్వహిస్తారు దాదాపు 7 వేల మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకోగా భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.

ధ్వజారోహణంతో పాటు గర్భగుడిలోని రామ్​ లల్లా, అన్నపూర్ణ మందిర్​ను దర్శించి పూజలు చేయనున్నారు ప్రధాని మోదీ. ఇంకా అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సప్త మందిరాలను దర్శించనున్నారు. ఇందులో మహార్షి వశిష్ఠ, మహార్షి విశ్వామిత్ర, మహార్షి ఆగస్త్య, మహార్షి వాల్మికీ, దేవి అహిల్య, నిశాద్​రాజ్​ గుహా, మాతా శబరి, శేషావతార్​ మందిరాలను సందర్శించనున్నారు.

“శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయం పూర్తైందని చెప్పుకునే క్షణం ఇంది. పవిత్రమైన మంగళవారం రోజున ధ్వజారోహణం జరగనుంది. ప్రధానమంత్రి మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్​ జెండాను ఎగరవేయనున్నారు. బలమైన ముహూర్త సమయం కోసం వెతికి నవంబర్​ 25న నిర్థరించాం. ఈరోజున వివాహ పంచమి వస్తుంది. మన మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు, సీతామాత వివాహం ఈ రోజునే జరిగింది” అని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి  గోవింద్​ దేవ్ గిరి మహారాజ్​ తెలిపారు.

2024 జనవరి 22న జరిగిన రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకతో పోల్చితే ఈసారి అతిథుల సంఖ్యను తగ్గించినట్టు రామాలయ ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. ఈ అద్భుత ఘట్టానికి ఆహ్వానితుల్లో 500 మందికిపైగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాధవులు ఉన్నట్టు వెల్లడించారు.  ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకకు అధికార యంత్రాంగం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

అయోధ్య‌లోని హ‌నుమాన్ గ‌ర్హి ఆల‌య పూజారి మ‌హంత్ రాజు దాస్ మాట్లాడుతూ సంక‌ట్ క‌టే మిటే స‌బ్ పీడా జో సుమిరై హ‌నుమ‌త్ బ‌ల‌బీరా అని చెప్పారు. శిఖ‌రంపై కాషాయ జెండాను ఎగుర‌వేసిన త‌ర్వాత‌.. యావ‌త్ ప్ర‌పంచం స‌నాత‌న సంస్కృతితో నిండిపోతుంద‌ని తెలిపారు. స‌నాత‌నం అనేద ధ‌ర్మం విజ‌యాన్ని నేర్పుతుంద‌ని, అధ‌ర్మాన్ని అంతం చేస్తుంద‌ని స్పష్టం చేశారు. ప్ర‌జ‌ల మ‌ద్య సోద‌ర‌భావాన్ని పెంచుతుంద‌ని, ప్రపంచ సంక్షేమం కాంక్షిస్తుంద‌ని, స‌ర్వ భ‌వ‌తు సుఖిన‌హ్, స‌ర్వ‌సంతు నిరామ‌య అనే భావాన్ని ధ‌ర్మ స‌నాత‌నం బోధిస్తుంద‌ని వివరించారు.