‘ఆధార్‌తో పాటు ఇతర నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలు అప్డేట్ చేసుకోని కారణంగా ఈ రోజు రాత్రి నుంచి మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేస్తున్నాం. వెంటనే ఈ కింద ఉన్న లింకును క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయండి’ అని టీం ఎస్బీఐ పేరుతో ఆదివారం అనేక వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు వచ్చాయి. ఎస్బీఐ అకౌంట్స్ ఉన్న చాలా మంది బ్లాక్ అవుతుందన్న భయంతో లింకుపై క్లిక్ చేశారు. అప్పటి నుంచే వారి మొబైల్స్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లాయి.
ఆ తర్వాత సదరు ఫోన్లో ఉన్న ఇతర వాట్సాప్ గ్రూపుల్లోకి ఈ సందేశాన్ని పంపారు. ఇలా గొలుసుకట్టుగా వేలాది ఫోన్లకు వెళ్లాయి. ఇందులో రాష్ట్ర మంత్రిత్వ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసుకున్న గ్రూపులతో పాటు స్నేహితులు, విద్యార్థుల గ్రూపులు కూడా ఉన్నాయి. ఫోన్లలోని సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరడంతో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. పలువురు స్థానిక పోలీసులతో పాటు 1930కి కూడా ఫిర్యాదు చేస్తున్నారు.
రాష్ట్రంలోని మంత్రులకు సంబంధించిన మీడియా వ్యవహారాల వాట్సాప్ గ్రూప్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్నారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ మంత్రుల శాఖలు పర్యవేక్షించే అధికారులు, జర్నలిస్టులకు ఎస్బీఐ పేరుతో మెసేజ్‌లు పంపినట్టు సమాచారం. ఈ ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

More Stories
కేశవ నిలయంలో “పంచ పరివర్తన్”పై ఏఐలో కార్యశాల
రిజర్వేషన్ జీవోకు మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా?
తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు