శ్రీ పద్మావతీ అమ్మవారి వాహ‌న‌సేవ‌లో త‌రిస్తున్న శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు

శ్రీ పద్మావతీ అమ్మవారి వాహ‌న‌సేవ‌లో త‌రిస్తున్న శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు తరిస్తున్నారు.  ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో అమ్మవారు పలు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సేవల్లో అమ్మవారి వాహనాలను మోస్తున్నది తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయపరులు. శ్రీరంగంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు శ్రీవైష్ణవ సంప్రదాయపరులు గత 35 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నారు.

శ్రీ అమ్మవారి వాహనం మోతాదుకు మించి బరువు ఉన్నా కేవలం భక్తి భావంతో ఎంతటి బరువున్నా అమ్మవారి సేవలో తరిస్తున్నారు. ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లును, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పెట్టేందుకు మరో ఇద్దరు ఉంటారు, వీటి అన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు రెండున్నర టన్నుకు పైగా బరువు ఉంటుంది.

ఉదయం, రాత్రి వాహనసేల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటలు పాటు బరువును మోస్తూ వాహన బ్యారర్లు తమ భక్తి భావాన్ని చూపుతున్నారు. అంతేకాక మూడు గంటల పాటు నడుచుకుంటూ భుజం మీద మోస్తూ నాలుగు మాడా వీధుల్లో తిరగడం అంటే సాధారణ విషయం కాదు. వాహన బ్యానర్లను తమ భుజాలు మీద మోయడం మూలంగా భుజంపై ఉబ్బి కాయ కాసినట్లు, పుండు లాగా ఉన్నా భక్తి భావం ముందు ఆ గాయ బాధలు కనిపించలేదు.

ఒకరా ఇద్దరా కాదు ఏకంగా 50 మందికి పైగా వైష్ణవ భక్తులు  అమ్మవారి వాహనసేవ కైంకర్యంలో పాలు పంచుకుంటున్నారు.  వీరంతా చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటి రంగంలోను, రైల్వే ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో  పని చేస్తున్నారు. వీరితోపాటు విద్యార్థులు కూడా ఉన్నారు.

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయంలోనూ వీరు ఇలాంటి సేవలు అందిస్తున్నారు. వీరు వాహనం మోసేటప్పుడు, వారి నడకలో నాలుగు రకాలైన విధానాలు పాటిస్తారు. అందరూ సమిష్టిగా వాహనాన్ని ఒక్కసారిగా భుజాల మీదకు ఎత్తడం, ఒకేసారి నిర్దేశిత ప్రాంతంలో దింపడం చూస్తే వారిలో ఉన్న ఐక్యతా భావాన్ని గమనించవచ్చు. తద్వారా వాహనంపై ఉన్న అమ్మవారు, వాహన సేవ వీక్షిస్తున్న భక్తులు తన్వయత్వం చెందుతారు.

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దేవేరి అయిన శ్రీపద్మావతి అమ్మవారిని తమ భుజస్కంధాలపై మోయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వాహన సేవకులు చెప్పడం విశేషం.  అందరికీ ఈ అవకాశం రాదని, అమ్మవారి కృపతో తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉన్నాయని అంటున్నారు. తమ ప్రాంత వాసులు గత 35 సంవత్సరాల పాటు శ్రీ పద్మావతీ అమ్మవారి వాహన సేవలో పాల్గొనడం ఆనందంగా ఉందని శ్రీరంగం శ్రీవైష్ణవులు చెబుతున్నారు.