5 కోట్ల పెండింగ్ కేసులు, మధ్యవర్తిత్వంలకు ప్రాధాన్యత

5 కోట్ల పెండింగ్ కేసులు, మధ్యవర్తిత్వంలకు ప్రాధాన్యత
దేశంలోని కోర్టులలో పెండింగ్ లో ఉన్న 5 కోట్లకు పైగా కేసుల పరిష్కారం, వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడం తన రెండు ప్రాధాన్యతలని  భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ)గా సోమవారం ప్రమాణంచేయనున్న జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.  న్యాయమూర్తులు, తీర్పులపై ఆన్లైన్ ట్రోలింగ్ తనను ఎప్పుడూ కలవరపెట్టలేదని చెబుతూ న్యాయమైన విమర్శలు ఎల్లప్పుడూ ఆమోదయోగ్యమైనవని స్పష్టం చేశారు.

“నా మొదటి, అతి ముఖ్యమైన సవాల్ సుప్రీంకోర్టులోని పెండింగ్ కేసులు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో 90,000కి పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపైనే దృష్టి సారించడమే కాకుండా, హైకోర్టులు, జిల్లా కోర్టులు ఇలా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను కూడా పరిష్కరించాలనుకుంటున్నాను” అని తెలిపారు.

“కేసుల పెండింగ్ తర్వాత రెండో ప్రాధాన్యత అంశం మధ్యవర్తిత్వం. ఇది వివాద పరిష్కారం కోసం సులభమైన మార్గాలలో ఒకటి. వివాదాలను పరిష్కరించడంలో గేమ్ ఛేంజర్ కావొచ్చు” అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.  న్యాయవాదులు మొదట హైకోర్టులో పనిచేసి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడం మంచి పద్ధతి అని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు.

హైకోర్టులు, దిగువ కోర్టులలో పెండింగ్‌ కేసులను తగ్గించడానికి కోర్టులు ఒక నిర్ణయానికి రాకుండా నిరోధించిన చట్టపరమైన ప్రశ్నలను నిర్ణయించడానికి రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. కక్షిదారులు దిగువ న్యాయస్థానాలు, హైకోర్టులకు వెళ్లకుండా సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారన్న దానిపై కారణాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

హైకోర్టులు కూడా రాజ్యాంగ న్యాయస్థానాలేనని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అలాగే న్యాయ వ్యవస్థలో కుత్రిమ మేధ వాడకం గురించి జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తావిస్తూ ఏఐ వాడకం ఎంత మేర న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టాలనే దానిపై కొంత భయం, సందేహం ఉందని పేర్కొన్నారు.  న్యాయవాదులు తమ కేసులను న్యాయమూర్తి నిర్ణయించాలని కోరుకుంటున్నారని, వారు సాంప్రదాయ వ్యవస్థను నమ్ముతారని తెలిపారు. అలాగే కొన్ని కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో న్యాయమూర్తులను ఆన్లైన్ ట్రోలింగ్ చేయడంపైనా జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. 

“నిజంగా చెప్పాలంటే నేను సోషల్ మీడియాను ‘అన్ సోషల్ మీడియా’ అని పిలుస్తాను. ఆన్లైన్ కామెంట్లకు నేను ఒత్తిడికి గురికాను. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నా పదవీ కాలంలో అలాంటి వ్యాఖ్యలతో నేనెప్పుడూ బాధపడలేదు. న్యాయమూర్తులు, తీర్పులపై న్యాయమైన విమర్శ ఎల్లప్పుడూ ఆమోదయోగ్యమైనదే” అని స్పష్టం చేశారు. 

“నేను ప్రతిరోజూ 50 నిమిషాల పాటు మార్నింగ్ వాక్ చేస్తాను. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్న రోజుకు 50 నిమిషాల నుంచి గంటపాటు నడుస్తాను” అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. సుమారు 15 నెలల పాటు ఆయన పదవిలో ఉండనున్నారు. 2027 ఫిబ్రవరి 9న 65ఏళ్ల వయస్సులో పదవీవిరమణ చేస్తారు.