53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం

53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం
53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే 15 నెలల పాటూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.  ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​ , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, పియూష్‌ గోయల్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
 
హర్యానాలోని హిస్సార్‌ జిల్లాకు చెందిన సూర్యకాంత్‌ ఓ మధ్య తరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం మాస్టర్స్‌ డిగ్రీలో టాపర్‌గా నిలిచారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.  అదే సంవత్సరం హిస్సార్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్‌ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. 
హర్యానాకు చెందిన జస్టిస్‌ సూర్యకాంత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన పంజాబ్‌, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు.  2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు.
న్యాయపరమైన తర్కానికి, సామాజిక న్యాయంపై బలమైన ప్రాధాన్యతకు పేరుగాంచిన ఆయన రాజ్యాంగ ధర్మాసనంలోని అనేక విషయాలలో, పాలన, పర్యావరణ సమస్యలు, రాజ్యాంగ వివరణలపై కీలక తీర్పులలో భాగంగా ఉన్నారు.  రాష్ట్ర అసెంబ్లీ బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ ఆలస్యంపై ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కూడా జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఉన్నారు.
బ్రిటీష్‌ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పులో భాగస్వామిగా ఉన్న ఆయన ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని తీర్పులో ఆదేశించారు.  వాక్‌స్వాతంత్య్రం, అవినీతి, బిహార్‌ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగసమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. బిహార్​లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఈసీ తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించిందిన ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
అలాగే 1976 అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మైనారటీ హోదాను పునఃసమీక్షించేందుకు మార్గాన్ని సుగమం చేస్తూ తీర్పు ఇచ్చిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. పెగాసస్​పై విచారణ జరిపిన కేసులోనూ సూర్యకాంత్ భాగస్వామిగా ఉన్నారు.