ప్రపంచంకు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సందేశం!

ప్రపంచంకు భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సందేశం!
ప్రపంచం ముక్కలు ముక్కలుగా విభజనకు గురవుతున్నట్టు కనిపిస్తున్న ఈ సమయంలో, భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా డైలాగ్ ఫోరం (ఐబిఎస్ఏ) సమూహం “ఐక్యత, సహకారం, మానవత్వం” అనే సందేశాన్ని పంపగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులకు చెప్పారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జి20 శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాలతో జరిగిన ఈ సమావేశంలో, “ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు” చోటు లేదని స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంలో, మూడు దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమాలోచనలను సంస్థాగతీకరించాలని ఆయన ప్రతిపాదించారు. వాతావరణ-స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఐబిఎస్ఏ నిధిని, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ), కోవిన్ వంటి ఆరోగ్య వేదికలు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌లు, మహిళల నేతృత్వంలోని సాంకేతిక చొరవలు వంటి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి వీలుగా డిజిటల్ ఆవిష్కరణ కూటమిని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు. 
 
ఈ చొరవలలో రెండవదాన్ని వచ్చే ఏడాది భారతదేశంలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రారంభించవచ్చని ఆయన సూచించారు. ఉగ్రవాద సమస్యపై మూడు దేశాలు “దగ్గరి సమన్వయంతో ముందుకు సాగాలి” అని ఆయన సూచించారు. “ఇంత తీవ్రమైన సమస్యపై ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం, మనం ఐక్యంగా చర్య తీసుకోవాలి.” అని స్పష్టం చేశారు.
 
 “ఐబిఎస్ఏ కేవలం మూడు దేశాల సమూహం కాదు; ఇది మూడు ఖండాలను, మూడు ప్రధాన ప్రజాస్వామ్యాలను, మూడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలను కలుపుతుంది” అని ప్రధాని చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాలుగు జి20 అధ్యక్ష పదవులు నిర్వహించిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశం “చారిత్రాత్మకమైనది,  సమయానుకూలమైనది” అని ఆయన పేర్కొన్నారు. 
 
“గత మూడు సంవత్సరాలుగా మూడు ఐబిఎస్ఏ దేశాలు జి20 అధ్యక్ష పదవిని నిర్వహించాయి. ఈ మూడు శిఖరాగ్ర సమావేశాలలో, మానవ-కేంద్రీకృత అభివృద్ధి, బహుపాక్షిక సంస్కరణ, స్థిరమైన వృద్ధి వంటి భాగస్వామ్య ప్రాధాన్యతలపై మనం అనేక ముఖ్యమైన చొరవలను తీసుకున్నాము. ఇప్పుడు, ఈ చొరవలను బలోపేతం చేయడం మన బాధ్యత” అని ఆయన చెప్పారు. 
 
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలకు మద్దతు ఇస్తూ, ప్రపంచ సంస్థలు “నేటి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించవు” అని మోదీ స్పష్టం చేశారు. ఐబిఎస్ఏ  దేశాలు ఏవీ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడు కాదని ఆయన గుర్తు చేశారు.  భద్రతా మండలి సంస్కరణలు ఇకపై ఒక ఎంపిక కాదని అవసరమని ప్రధాని తేల్చి చెప్పారు.