అనేక దేశాలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ భద్రతా సవాళ్ళలో కొన్నింటినైనా ఎదుర్కొనడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రతిస్పందనా బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని సూచించారు. ఆరోగ్య రంగ సంక్షోభాలు తరచుగా నెలకొంటున్న తరుణంలో ఇటువంటి బృందాల ఏర్పాటు వల్ల మరింత సమన్వయంతో, సమర్థవంతంగా పని చేయడానికి వీలుంటుందని ఆయన చెప్పారు.
“ప్రస్తుత సమయంలో మన అభివృద్ధి ప్రాధాన్యతలను పునఃసమీక్షించాలి. సమ్మిత, స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టాలి. సమగ్ర మానవతావాదం వంటి భారతీయ సాంప్రదాయ విలువలు సుస్థిర అభివృద్ధికి మార్గం చూపుతాయి. ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ఆందోళనకరం. డ్రగ్ రాకెట్లు, ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థల సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జీ20 ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ మాదక ద్రవ్య- ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చాలి” అని ప్రధాని మోదీ తెలిపారు.
గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ ఏర్పాటుకు ప్రధాని మోదీ ప్రతిపాందించారు. మనందరి సమిష్టి జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ జ్ఞానం, పర్యావరణ అనుకూల జీవన విధానాలు, మానవ సమాజాన్ని బలపరిచే పద్ధతులను భద్రపరచడానికి ఈ నాలెడ్జ్ రిపోజిటరీని ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రస్తుతం ప్రపంచానికి సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధి అవసరమని మోదీ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ ఆరోగ్య ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేస్తే మహమ్మారులను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. అందుకోసం జీ20 సభ్య దేశాల్లోని వైద్య నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితికి వెంటనే ప్రతిస్పందించగల గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్ అవసరమని తెలిపారు.
ప్రపంచ పురోగతికి ఆఫ్రికా అభివృద్ధి కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ ఎల్లప్పుడూ ఆఫ్రికాకు మద్దతుగానే ఉందని తెలిపారు. 2023లో ఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సదస్సులోనే ఆఫ్రికా సమాఖ్యకు జీ20లో శాశ్వత సభ్యత్వం లభించిందని గుర్తుచేశారు. వచ్చే దశాబ్ద కాలంలో ఆఫ్రికాలో 10 లక్షల మంది సర్టిఫైడ్ ట్రైనర్స్‌ను తయారు చేసేందుకు సంయుక్తంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

More Stories
రిజర్వేషన్ జీవోకు మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా?
ఢిల్లీ ఉగ్రదాడికి స్వయంగా రూ 26 లక్షలు సమకూర్చిన వైద్యులు!
అడవిలో అన్నల తుపాకీ మోత ఆగిపోయిందా?