కళలు, సంప్రదాయ మహోత్సవాలతో జాతీయ ఐకమత్యం మరింత బలోపేతం అవుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, వీటి కారణంగా దేశ వారసత్వంపై ప్రజలకు అవగాహన పెరుగుతోందని ఆమె తెలిపారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ‘పశ్చిమ్ కి పరంపర’ పేరుతో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో వారసత్వంగా వచ్చిన కళా సంపద, సంప్రదాయాలను యువతీ యువకులు తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. భారతీయ కళా మహోత్సవ్ తొలి ఎడిషన్‌లో ప్రజలకు ఈశాన్య భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేశామని రాష్ట్రపతి చెప్పారు.
ఈసారి పశ్చిమ భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చూసే, అర్థం చేసుకునే అవకాశం మనకు లభించింది. ఈ ఉత్సవంలో సందర్శకులు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, డామన్ మరియు డయ్యూ, దాద్రా, నాగర్ హవేలీల హస్తకళలు, నృత్యం, సంగీతం, సాహిత్యం, వంటకాల ద్వారా భారతదేశ పశ్చిమ ప్రాంతాల జానపద సంస్కృతిని వీక్షించగలరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
కళా మహోత్సవంలో ఈసారి ప్రత్యేకంగా పశ్చిమ భారతదేశంలోని భాషలు, ఉప భాషలు, సాహిత్య సంప్రదాయాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయని ఆమె వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఏటా లక్షల మంది విదేశీయులు వస్తున్నారని, ఎంతో ఆసక్తిగా సూక్ష్మ అంశాలను గ్రహిస్తున్నారని ఆమె చెప్పారు. కళా మహోత్సవ్‌లో హైదరాబాద్ నిఫ్ట్ విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. విద్యార్థులు రూపొందించిన దుస్తులను రాష్ట్రపతి పరిశీలించారు.
రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆమె సందర్శించారు. కళాకారులు, ప్రదర్శన బృందాల సభ్యులతో రాష్ట్రపతి మాట్లాడారు. కళాబృందాల సభ్యులతో నృత్యం చేశారు. ఈ వేడుకల్లో గోవా, తెలంగాణ, రాజస్థాన్ గవర్నర్లు పూసపాటి అశోక్ గజపతి రాజు, జిష్ణుదేవ్ వర్మ, హరిభౌ కిషన్‌రావు బగాడే, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, గజేంద్రసింగ్ షెకావత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సహా పలువురు గుజరాత్ మంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క జనవరిలో జరిగే మేడారం మహా జాతరకు రావాలంటూ రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించారు. కళామహోత్సవం నవంబరు 22 నుంచి 30 వరకు కొనసాగనుంది. ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.

More Stories
లొంగుబాటుకు మావోయిస్టులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధం
కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా