పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల భాగస్వామి ఎన్డీయే కూటమి కోసం ‘హోం శాఖ’ ను సీఎం వదిలేశారు. రెండు దశాబ్దాలుగా చూసుకున్న హోంను భారతీయ జనతా పార్టీకి సీఎం నితీశ్ అప్పగించారు. తొలిసారిగా హోం శాఖను మిత్రపక్షానికి కేటాయించారు. ఆయన శుక్రవారం ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీకి బాధ్యతలు కట్టబెట్టారు.
బిజెపికి చెందిన మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు భూమి, రెవెన్యూ శాఖను అప్పగించారు. వీటితో పాటు గనులు, భూగర్భ శాఖ బాధ్యతలు విజయ్ కుమార్ చూసుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైశ్వాల్కు పరిశ్రమల శాఖను ఇచ్చారు. సాధారణ పరిపాలన శాఖ, కెబినెట్ సెక్రెటేరియట్, విజిలెన్స్ శాఖలను తనవద్దే ఉంచుకున్నారు సీఎం నీతీశ్ కుమార్.
మరో కీలకమైన ఆర్థిక శాఖను జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్కు కేటాయించారు. ఎన్డీఏ కూటమిలో చేరిన నాటి నుంచి ఆర్థిక శాఖ బీజేపీ వద్దే ఉండగా తొలిసారి జేడీయూకు దక్కింది. మరో జేడీయూ సీనియర్ శ్రవణ్ కుమార్కు పంచాయితీ రాజ్ గ్రామిణాభివృద్ధి, రవాణా శాఖలను ఇచ్చారు. మరో నేత అశోక్ చౌదరికి రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ కేటాయించారు. విజయ్ చౌదరికి భవన నిర్మాణ రంగాల శాఖను ఇచ్చారు.
అంతకుముందు గురువారం బిహార్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం పట్నాలోని గాంధీ మైదానంలో సందడిగా జరిగింది. నీతీశ్‌తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బిజెపి నుంచి 14 మంది, జెడియు నుంచి 8 మంది చొప్పున ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌జనశక్తి-ఎల్జేపీ-రామ్విలా స్ పాసవాన్ పార్టీ నుంచి ఇద్దరు, రాష్ట్రీయ లోక్ మోర్చాకు చెందిన ఒకరు, హిందూస్తాన్ అవామ్ మోర్చా నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కింది.
కాగా, ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్‌ను స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశం ఉందని తెలిసింది.

More Stories
కశ్మీర్ ఆసుపత్రుల కింద ఆయుధ డంప్‌కు కుట్రలు
లోయలో ప్రత్యేక ప్రాంతంకై కశ్మీరీ పండిట్ల ఉద్యమం
హింసామార్గాన్ని వదిలివేస్తున్న మావోయిస్టులు