తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యాల సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌, అప్పాసి నారాయణ అలియాస్‌ రమేశ్‌, సోమ్‌దా అలియాస్‌ ఎర్రా ఉన్నట్లు డీజీపీ తెలిపారు. మిగతా 34 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 25 మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది.

లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్‌ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు డీజీపీ చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. 303 రైఫిల్స్‌, జీ3 రైఫిల్స్‌, ఏకే 47లు, ఎస్‌ఎల్‌ఆర్‌, భారీగా బుల్లెట్లను అప్పగించారని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు నగదుతోపాటు మరికొన్ని వెసులుబాట్లు కూడా కల్పిస్తామని చెప్పారు.

తాము పార్టీకి చెప్పే లొంగిపోయామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. స్టేట్‌ కమిటీలో ఉన్న ఇంకా ఇద్దరు అగ్రనేతలు కూడా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తామంతా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయం తీసుకున్నామని దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ సభ్యుడు ఎర్రా తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడిపించడం కష్టమని పేర్కొన్నారు. తమ  ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించడం లేదని చెప్పారు.

ఆజాద్‌పై రూ.20 లక్షలు, అప్పాసి నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉందని డీజీపీ తెలిపారు. వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులు అందరిపైనా కలిపి మొత్తం 1.41 కోట్ల రివార్డు ఉందని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని వారికే అప్పగిస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీ అందిస్తామని తెలిపారు.

తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు ఉన్నారని చెబుతూ వారు కూడా తొందరగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్జీ, పాక హనుమంతు అలియాస్‌ గణేశ్‌, బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఉన్నారని తెలిపారు. రాష్ట్ర కమిటీలో 10 మంది వరకు ఉన్నారని చెప్పారు.