ధ్వజారోహణం హిందూత్వ అభ్యున్నతి , అస్తిత్వ ప్రతీక

ధ్వజారోహణం  హిందూత్వ అభ్యున్నతి , అస్తిత్వ ప్రతీక

సుబోధ్ మిశ్రా

ధ్వజారోహణం (జెండా ఎగర వేయడం) కేవలం ఒక శాస్త్ర  పరమైన లేదా జాతీయ కార్యక్రమం మాత్రమే కాదు; దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక,  సాహిత్య పరమైన ప్రాధాన్యం ఉంది. దీని ధార్మిక, సాహిత్య పరమైన గాఢతను సూక్ష్మంగా గ్రహించవచ్చు.

ఆధ్యాత్మిక ప్రాధాన్యం

ఇది స్వాభిమానానికి, అంతరంగ  మేల్కొలుపుకు ఒక ప్రతీకగా భావించొచ్చు .  జెండా ఎగర వేయడం అంటే గౌరవం, ధైర్యం, సత్యం పట్ల మనస్సులో జాగృతి కలిగించడం. ఇది మనసులో ఆత్మవిశ్వాసం, సంకల్పబలం మరియు సానుకూల శక్తిని నింపుతుంది. జెండాను ఎత్తుగా ఎగరనివ్వడం అంటే దివ్య చైతన్యాన్ని మేల్కొలపడం, దేవుని సాన్నిధ్యాన్ని ఆహ్వానించడం. ధ్వజం “శక్తి కేంద్రం”గా కూడా పరిగణించబడింది. ఇది మనిషి తన అహంకారాన్ని విడిచిపెట్టి, దేవుడి లేదా ధర్మం పట్ల సమర్పణ భావాన్ని వ్యక్తపరుస్తుందని సందేశం ఇస్తుంది. ఇది భక్తి, వినయం మరియు ఆత్మసమర్పణ యొక్క ప్రతీక.

ధార్మిక ధ్వజాల పాత్ర

ఇల్లు , దేవాలయం, మఠం, పర్వతాలపై ధార్మిక ధ్వజాలను నిలపడానికి కారణం— అవి దుష్ట (నెగటివ్) శక్తులను దూరం చేసి, ఆ ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచి, దివ్య ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయని నమ్మకం. బౌద్ధంలో ప్రార్థనా ధ్వజాలు కూడా ఇదే ఉద్దేశ్యంతో ఉంచబడతాయి. అలాగే దేవాలయాలపై భగవా(కాషాయ) ధ్వజం, గురుద్వారాల్లో నిషాన్ సాహిబ్, జైన మందిరాల్లో పంచరంగి ధ్వజం— ఇవన్నీ తమ తమ సంప్రదాయం, పవిత్రత , గౌరవానికి ప్రతీకలు.

ధ్వజారోణం – పండుగలు, ఆరాధనా దినాలు, లేదా ప్రత్యేక ఆధ్యాత్మిక సందర్భాలలో జరుగుతుంది. ఇది ఆ రోజు పవిత్రమైనది మరియు దివ్య శక్తులతో నిండి ఉందని సూచిస్తుంది. ప్రాచీన కాలం నుంచి ధ్వజం అసత్యం పై సత్యం యొక్క విజయానికి సంకేతం గా భావిస్తూ వస్తున్నారు. ధార్మిక జెండా ఎగరడం ద్వారా ధర్మం, సత్యం, సద్గుణాల శక్తి ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయని తెలియజేస్తుంది.

సామూహికత, ఆత్మీయత

ధ్వజం ఓ సముదాయం, దేశం లేదా సంస్థ సామూహిక శక్తి, సమైక్య భావనకు ప్రతీక. ధ్వజారోహణ సమయంలో ప్రజలలో ఒక సమిష్టి చైతన్యం, భావోద్వేగ ఏకత్వం ఏర్పడుతుంది— ఇదీ ఒక ఆధ్యాత్మిక అనుభవమే. భారతీయ సంస్కృతిలో ప్రతీకల పట్ల గౌరవం— అది దేవత విగ్రహం కావచ్చు లేదా జాతీయ పతాకం కావచ్చు— మనసును క్రమశిక్షణగలదిగా, వినమ్రంగా, ఆదర్శాల పట్ల అంకితభావంతో ఉండేలా చేస్తుంది. ఇది కూడా ఆధ్యాత్మిక సాధనలో భాగం.

పండితుల అభిప్రాయం ప్రకారం, జెండా పైకి ఎగరడం అంటే మనిషి చైతన్యం, పురోగతి, అభివృద్ధి పైకి సాగుతున్న సంకేతం. జీవితంలో విలువలు, ఆదర్శాలు, కర్తవ్యాలు ఎల్లప్పుడూ పర్వత శిఖరంలా ఉన్నతంగా ఉంచాలని ఇది తెలియజేస్తుంది.

సాంస్కృతిక మరియు సాహిత్య దృష్టి

ధ్వజం ఒక అత్యంత ప్రభావవంతమైన ప్రతీక. కవిత్వం, కథలు, వ్యాసాలలో ధ్వజం స్వాతంత్ర్యం, పోరాటం, విజయం వంటి భావాలను ప్రతిబింబిస్తుంది. జెండాలోని ప్రతి రంగు, దాని లయలో ఎగరడం— ఇది మన స్వతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తుంది. సాహిత్యంలో ఇది భావోద్వేగం, ప్రేరణ, కరుణ, స్పూర్తిని పెంచుతుంది. గాలిలో లలితంగా ఎగురుతున్న ధ్వజం— చలనశీలత, ఆశ, నిరంతర ప్రయత్నానికి ప్రతీకగా నిలుస్తుంది. అందువల్ల కవులు, రచయితలు, నాటక కర్తలు దీన్ని ఆదర్శాలు, పోరాటం, ప్రేరణల రూపంగా ఉపయోగిస్తారు.

ధ్వజం ఒక సముదాయం లేదా దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, అస్తిత్వానికి  ప్రతినిధి. సాహిత్యంలో ఇది గౌరవం, గుర్తింపు, సాంస్కృతిక వారసత్వానికి బలం అందిస్తుంది.
సరళంగా చెప్పాలంటే— ధ్వజారోహణం ఆధ్యాత్మిక కోణంలో-ఆత్మగౌరవం, ఏకత్వం, ఊర్ధ్వగతి, శక్తి, చైతన్య మేల్కొలుపుకు ప్రతీక మరియు సాహిత్యపరంగా- స్వాతంత్ర్యం, త్యాగం, ప్రేరణ,ఆత్మాభిమానం, సాంస్కృతిక గౌరవములను సూచిస్తుంది.