శబరిమల బంగారు తాపడం దోపిడీ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్‌ను అరెస్టు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. ఎస్పీ శశిధరన్ నేతృత్వంలో తిరువనంతపురంలోని ఒక రహస్య ప్రదేశంలో సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన అనంతరం సిట్ ఆయనను అరెస్టు చేసింది.
ఈ కేసులో బుధవారం సాయంత్రమే సిట్ పద్మకుమార్‌కు సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం పతనంతిట్ట అరన్ములలోని తన నివాసం నుంచి రాజధానికి చేరుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కొల్లం విజిలెన్స్ కోర్టు ముందు హాజరుపరుచనున్నారు.
ఇదిలా ఉండగా ఈ కేసులో గతంలో అరెస్టైన దేవస్థానం మాజీ కమిషనర్ ఎన్. వాసు అందించిన వాంగ్మూలం ఆధారంగా పద్మకుమార్‌ను ప్రశ్నించాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో వాసుతో పాటు పద్మకుమార్ కూడా సంబంధం ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. 2019 ఫిబ్రవరి 26న వాసు బంగారాన్ని రాగిగా మార్చినట్లుగా చేసిన ఓ ఫైల్‌ను ఏర్పాటు చేశాడు.
తరువాతి నెలలో పద్మకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్థానం బోర్డు సమావేశంలో ఈ ఫైల్‌కు ఆమోదం లభించింది. అయితే ఈ ఆమోదంలో కీలక నిందితుడైన ఉన్నికృష్ణన్ బోర్డు నియమాలను ఉల్లంఘించడానికి, బంగారు పూత పూసిన తలుపు ఫ్రేములను తొలగించి, బంగారాన్ని దొంగిలించడానికి అనుమతించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్, పద్మకుమార్ ప్రమేయం ఉందని నిర్ధరించుకుంది. పద్మకుమార్ కేరళ శాసనసభలో కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు. పతనంతిట్టలో సీపీఐ(ఎం)లో సీనియర్ వ్యక్తిగా కొనసాగుతున్నారు. అంతకుముందు శబరిమల బంగారం దోపిడీ కేసులో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు కేరళ హైకోర్టు సూచించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేసింది.

More Stories
నేపాల్‌లో జెన్‌జెడ్ నిరసనలతో 42 బిలియన్ డాలర్ల నష్టం
నలుగురు ఇండిగో అధికారులు సస్పెండ్
భారత్ ఎగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాలు