నేపాల్‌లో మళ్లీ జెన్‌ జెడ్ నిరసనలు.. కర్ఫ్యూ!

నేపాల్‌లో మళ్లీ జెన్‌ జెడ్ నిరసనలు.. కర్ఫ్యూ!
పొరుగుదేశమైన నేపాల్‌లో యువతరం మరోసారి భగ్గుమంది. రెండు నెలల క్రితం కేపీ ఓలీ ప్రభుత్వాన్ని పడగొట్టిన కే జెన్‌జెడ్ ఈసారి ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూను తిరిగి విధించడాన్ని ఖండిస్తూ బారా జిల్లాలో వందలాది యువత ఆందోళనలు చేపట్టారు. 
 
కొత్త సర్కార్ ఏర్పడినప్పటి నుంచి మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మద్దతుదారులు, జెన్‌జెడ్‌ నిరసనకారులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దాంతో..ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని పగటిపూట ఆంక్షలను మళ్లీ విధించింది. అసలే కోపం మీదున్న జెన్‌ జెడ్ కర్ఫ్యూను నిరసిస్తూ రోడ్డెక్కారు.
 
అంతర్గత వివాదాలు, సంక్షోభంతో నేపాల్ వార్తల్లో నిలుస్తోంది. అధికారం పోవడంతో మండిపోతున్న కేపీ ఓలీ పార్టీ నేతలు, కార్యకర్తలు జెన్‌జెడ్‌తో తరచూ ఘర్ణణలకు దిగుతున్నారు. తాజాగా సిమరా ప్రాంతంలో నవంబర్ 19న యువతరంతో ఓలీకి చెందిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) కార్యకర్తలు గొడవ పడ్డారు. 
 
ఇరువర్గాల ఘర్షణలతో ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని మళ్లీ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.  అయితే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన పన్నెండుమంది జెన్‌జెడ్‌తో ఘర్షణ పడ్డారు. కానీ, పోలీసులు ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన జెన్‌జెడ్ మరోసారి ఆందోళనకు దిగింది.
తాము ఏర్పాటు చేయించిన ప్రభుత్వం కూడా అక్రమార్కులకు అండగా నిలవడాన్ని సహించలేకపోతోంది నవతరం. అధికారంలో ఉన్నవాళ్లు పారదర్శక పాలన చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  మరోవైపు, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉండాలని తాత్కాలిక ప్రధాని జస్టిస్ సుశీలా కార్కీ ఆదేశించారు.
రాజకీయంగా రెచ్చగొట్టే ప్రచారానికి దూరంగా ఉండాలని, ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలు విశ్వాసం ఉంచాలని ఆమె పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీల స్వేచ్ఛగా తిరిగేలా ఎన్నికలకు న్యాయమైన, శాంతియుత వాతావరణాన్ని సృష్టించాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. నేపాల్ తాత్కాలిక ప్రధాని 110కిపైగా రాజకీయ పార్టీలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘‘ఈ దేశం కొత్తతరం చేతుల్లో ఉండాలని,దార్శనికత కలిగిన వ్యక్తులు పాలనలో కొనసాగాలని మేము కోరుకుంటున్నాం’’ అని ఆమె సమావేశంలో స్పష్టం చేశారు