లొంగుబాటుకు మావోయిస్టులు రాజిరెడ్డి, ఆజాద్‌ సిద్ధం

లొంగుబాటుకు మావోయిస్టులు రాజిరెడ్డి, ఆజాద్‌ సిద్ధం
హిడ్మా దారుణ ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టు కీలక నేతలు లొంగుబాట పట్టారు. మరో రెండు రోజుల్లో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆజాద్‌ సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీరి లొంగుబాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వారికి రాజ్యాంగప్రతిని ఇవ్వడంతో పాటు వారిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డ్ మొత్తాన్ని కూడా అందజేయనున్నారు.
 
ఇటీవల మావోయిస్టు పార్టీకి జనరల్‌ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీని లొంగుబాటుకు ఒప్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనట్టు తెలిసింది. మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు దామోదర్‌ కూడా లొంగిపోవాలని తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే, అతడు లొంగిపోయేందుకు సిద్ధంగా లేడని తెలిసింది. హిడ్మాను నమ్మించి ఎన్‌కౌంటర్‌ చేసినట్టే తమను కూడా ఎన్‌కౌంటర్‌ చేస్తారేమోనని దామోదర్‌, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు సందేహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.
 
హిడ్మా ఎన్‌కౌంటర్‌కు ముందే తెలంగాణ పోలీసుల అదుపులోకి మావోయిస్టు రాష్ట్ర నాయకులు ఆజాద్‌, నారాయణ, వారితోపాటు క్యాడర్‌ వచ్చారు. ఎవరైనా సీసీ మెంబర్‌ స్థాయి వాళ్లను లొంగుబాటుకు ఒప్పించి, వారితో పాటు వీరిని కూడా మీడియా ముందు చూపించాలని ప్రభుత్వ పెద్దలు వీరి లొంగుబాటును ఆపినట్టు తెలిసింది. ఈ క్రమంలో దేవ్‌జీ, దామోదర్‌ కోసం ప్రయత్నాలు చేశారని తెలిసింది. వారు లొంగుబాటుకు సుముఖంగా లేరని తేలడంతో రాజిరెడ్డి, ఆజాద్‌, నారాయణ లొంగుబాటును ఒక సభగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.