కాంగ్రెస్ శాసన సభ్యుల బృందం, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు విధేయులైన కొంతమంది మంత్రులు కాంగ్రెస్ అధిష్టానంను కలవడానికి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తున్నది. సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని ఒప్పించడానికి ఆ వర్గం దేశ రాజధానికి చేరుకున్నట్లు సమాచారం.
కర్ణాటక మంత్రి ఎన్. చలువరాయస్వామి, ఎమ్మెల్యేలు ఇక్బాల్ హుస్సేన్, హెచ్.సి. బాలకృష్ణ, ఎస్.ఆర్. శ్రీనివాస్ కాంగ్రెస్ కీలక నేతలను కలవడానికి దేశ రాజధానికి చేరుకున్నట్లు సమాచారం.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రెండున్నరేండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘ముందుగా కుదిరిన పవర్ షేరింగ్ ఒప్పందం’ ప్రకారం తమ నేతకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని హైకమాండ్‌ను వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు డీకే వర్గంగా ముద్రపడిన 10 మంది ఎమ్మెల్యేలు తాజాగా ఢిల్లీకి వెళ్తుండటం రాజకీయంగా కలకలం రేపుతోంది. శుక్రవారం మరో డజను మంది శాసనసభ్యులు దేశ రాజధానికి చేరుకునే అవకాశం ఉంది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో వారు సమావేశం కానున్నారు. రెండున్నరేండ్ల కిందట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నది వారి ఏకైక డిమాండ్‌గా పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘నేనెందుకు వెళ్తున్నాను? బంగారం, వజ్రాలు అడిగేందుకు కాదు కదా? డీకే కోసం వెళ్తున్నా’ అని పేర్కొన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను పూర్తికాలం పదవిలో కొనసాగుతానని సూచించిన ఒక రోజు తర్వాత, శివకుమార్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి సుముఖత వ్యక్తం చేశారు. బుధవారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో, తాను వచ్చే ఏడాది 17వ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతానని పేర్కొంటూ ముఖ్యమంత్రిగా పూర్తి ఐదేళ్లు కొనసాగుతానని సూచించారు.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఏ నాయకుడూ బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా, అనేక రౌండ్ల చర్చల తర్వాత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, శివకుమార్‌ను ఉపముఖ్యమంత్రిగా చేసే ఫార్ములాను మధ్యవర్తిత్వం వహించగలిగారు.
రెండున్నర సంవత్సరాల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని, ఆ ఫార్ములాను నాయకులు రొటేషన్ ఫార్ములాకు అంగీకరించారని అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. ఇంతలో, బుధవారం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని శివకుమార్ కోరికను వ్యక్తం చేశారు. “నేను శాశ్వతంగా పదవిని నిర్వహించలేను. ఇప్పటికే 5.5 సంవత్సరాలు అయింది. మార్చిలో ఆరు సంవత్సరాలు అవుతుంది. ఇతరులకు అవకాశం ఇవ్వాలి. కానీ నేను నాయకత్వంలో ఉంటాను. చింతించకండి, నేను ముందు వరుసలో ఉంటాను” అని శివకుమార్ ఒక కార్యక్రమంలో నర్మగర్భంగా చెప్పారు.
కాగా, శివకుమార్ సోదరుడు డి.కె. సురేష్ మాట్లాడుతూ, పార్టీలోని సీనియర్లకు అవసరమైన దాని గురించి మాజీ అధ్యక్షుడు తెలియజేశారని తెలిపారు. “ఈ విషయం ఇప్పుడు పార్టీ, దాని నాయకత్వం, ఏఐసీసీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవడానికి వదిలివేయబడింది” అని ఆయన పేర్కొన్నారు.

More Stories
హిందువులు చైతన్యవంతులైతేనే ఆశించిన ఫలితం
విదేశీ నిధులకోసం క్రైస్తవ సంస్థలో `జోగినులు’గా విద్యార్థినులు
గోవా నైట్‌క్లబ్ యజమానులు థాయిలాండ్ లో అరెస్ట్!