జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ మీడియా సంస్థ కార్యాలయంలో క్యాట్రిడ్జ్‌లు లభించడం కలకలం రేపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో జమ్ము కశ్మీర్ పోలీసులకు చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ గురువారం జమ్ము కశ్మీర్‌లోని కశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏకే-47 బుల్లెట్లు లభించాయి.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం గురువారం ఉదయం నుంచి చేపట్టిన సోదాల్లో ఏకే-47 బుల్లెట్లు, పిస్టల్ రౌండ్స్ , మూడు గ్రనేడ్ లెవర్స్ లను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశం, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి.
అంతేకాదు కశ్మీర్ టైమ్స్‌పై ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేశారు. ఇందులో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పేరును కూడా చేర్చారు. దేశంపై అసంతృప్తిని వ్యాప్తి చేయడం, వేర్పాటువాదాన్ని కీర్తించడం.. దేశంతో పాటు జమ్మూకాశ్మీర్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతకు నష్టం కలిగించే విధంగా కథనాలు ప్రచురిస్తోందని పోలీసులు ఆరోపించారు.
కాగా, ది కాశ్మీర్ టైమ్స్ ఎడిటర్‌కు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర పోలీసు దర్యాప్తు సంస్థ చేస్తున్న దాడులపై ఉప ముఖ్యమంత్రి సురేందర్ సింగ్ చౌదరి స్పందిస్తూ ఈ దాడులు మీడియాపై ఒత్తిడి పెంచడానికి కాదని స్పష్టం చేశారు. కేవలం తప్పుడు పనులకు పాల్పడిన వారిపైనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇలా ఉండగా, తమ గొంతుకను అణిచివేసేందుకే తమ కార్యాలయంపై ఎస్‌ఐఎ దాడులని కాశ్మీర్ టైమ్స్ సంపాదకులు ప్రబోధ్ జామ్వాల్, అనురాధ భాసిన్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. తమపై మోపబడిన ఆరోపణలు ”బెదిరించడానికి, చట్టబద్ధ హోదాను తొలగించడానికి, చివరికి తమ గొంతుకలను అణిచివేసేందుకు రూపొందించబడినవి” అని తెలిపారు.
కశ్మీర్ టైమ్స్ జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దీన్ని వేద్ భాసిన్ స్థాపించారు. 1954లో వీక్లీగా ప్రచురణ ప్రారంభించిన ఈ పత్రిక ఆ తర్వాత డైలీగా మారింది. భాసిన్ కుమార్తె అనురాధ భాసిన్ ప్రస్తుతం పత్రిక ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

More Stories
శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు
జమ్ము-కాశ్మీర్ లో అనుమానాస్పద బెలూన్ తో కలకలం
ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందే