ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు, ఆ సమయంలో కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్రసంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. మొత్తం 42 వీడియోలు వచ్చిన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
అతడు జమ్ము కశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అనే ఉగ్రవాద మద్దతుదారు ద్వారా ఫరీదాబాద్ ఉగ్రనెట్‌వర్క్‌లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్‌తో టచ్‌లోకి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. అతడి ద్వారా ఉమర్ నబీ సహా పలువురు వైద్యులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించినట్లు దర్యాప్తులో తేలింది. హంజుల్లా ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.
ఉగ్ర కుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్ లో చర్చించుకునేవారని, ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్ లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేమ్ లను ఉపయోగించినట్లు గుర్తించారు.
అక్టోబర్ లో జమ్మూకశ్మీర్ లోని నౌగామ్ లో జైషే మహ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్రకుట్రలపై దర్యాప్తు మొదలైన విషయం తెలిసిందే. ఆ పోస్టర్లపై ‘కమాండర్ హంజుల్లా భాయ్’ అనే పేరు రాసి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అంతేకాక ఢిల్లీలో ఉగ్రదాడులు చేయడానికి వీరు కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
2022లో ముగ్గురు ఉగ్ర డాక్టర్లు తుర్కియేలో పర్యటించిన సమయంలో పాక్ హ్యాండ్లర్ అక్కడ వారు సిరియాకు చెందిన ఆపరేటివ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో వారు బాంబుల తయారీ, ఉగ్రదాడుల ప్రణాళికలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్ లోని పై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ వైట్ కాలర్ టెర్రర్ బృందం 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ పోజివ్ డివైజ్ (ఐఇడి) లను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇలా ఉండగా, ఢిల్లీ పేలుడు నేపథ్యంలో అధిక మోతాదులో అమోనియం నైట్రేట్(,) అమ్మడం, కొనడం జరిగితే, దానికి సంబంధించిన డిజిటల్ రికార్డును మెయిన్‌టేన్ చేయాలని ఢిల్లీ పోలీసులను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీచేశారు. అమ్మేవారి, కొనేవారి ఫోటోలు ఉండాలని తెలిపారు.

More Stories
భారత్‌లోనూ సిడ్నీ తరహా దాడులకు అవకాశం
స్థానిక ఎన్నికల ఓటమితో కేరళలో సిపిఎం హింసాకాండ!
భారత్ కూల్చివేసిన పాక్ ప్రయోగించిన తుర్కియే డ్రోన్!