అనిల్ అంబానీ రూ. 1,400 కోట్ల ఆస్తుల జప్తు

అనిల్ అంబానీ రూ. 1,400 కోట్ల ఆస్తుల జప్తు

బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచిన రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో భాగంగా తాజాగా రిలయన్స్‌ గ్రూప్‌నకు సంబంధించిన రూ.1,400 కోట్ల పైగా ఆస్తులను ఇడి అటాచ్‌ చేసింది. ఇప్పటికే రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.  తాజా చర్యలతో రూ.9,000 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్‌ చేసినట్లయ్యింది.

ఇది వరకు జప్తు చేసిన వాటిలో ముంబయిలోని పాలిహిల్‌లో ఉన్న అనిల్‌ అంబానీ నివాసం, నవీ ముంబయిలోని ధీరూభారు అంబానీ నాలెడ్జ్‌ సిటీలోని 132 ఎకరాల భూమి, ఢిల్లీ, చెన్నరు, పూణె, హైదరాబాద్‌ వంటి ఇతర నగరాల్లోని నివాస, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా సహా అనిల్‌ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఇడి ముందు విచారణకు హాజరుకావాల్సిన అనిల్‌ అంబానీ డుమ్మా కొట్టారు.

అనిల్‌ గ్రూప్‌ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ తొలుత దర్యాప్తు చేపట్టింది.  ఈ సంస్థ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఇడి దీనిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో రిలయన్స్‌ గ్రూప్‌లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది.

రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌), రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సిఎఫ్‌ఎల్‌) సంస్థల ద్వారా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఇడి దర్యాప్తు చేస్తోంది. ఇడి విచారణ ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆస్తుల అటాచ్‌మెంట్‌పై రిలయన్స్‌ గ్రూప్‌ నుండి అధికారిక స్పందన రావాల్సి ఉంది.