ఏటీఎస్ కు మదర్సా విద్యార్థులు, మౌలానాల వివరాలు 

ఏటీఎస్ కు మదర్సా విద్యార్థులు, మౌలానాల వివరాలు 
ఉగ్రవాద ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన తాజా బాంబ్‌ పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. దీనితో భద్రతను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మదర్సాలపై కీలక నిర్ణయం తీసుకుంది.  యూపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని మదర్సాలు—గుర్తింపు ఉన్నా, లేకపోయినా, తమ వద్ద చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న మౌలానాలు, ఉపాధ్యాయుల పూర్తి వ్యక్తిగత వివరాలను ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్)కు అందించాల్సి ఉంటుంది.
 
వారు పేరు, ఆధార్ నంబర్, శాశ్వత చిరునామా, మొబైల్ నంబర్, ఇతర గుర్తింపు పత్రాలను అందించాల్సి ఉంటుంది.  ఈ చర్య కేవలం డేటా సేకరణ కోసం మాత్రమే కాకుండా, మదర్సాలలో జరిగే అనుమానాస్పద చర్యలను ముందుగానే గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపం వద్ద పేలుడు సంభవించడంతో దేశ భద్రతా సంస్థలు అత్యవసరంగా అప్రమత్తమయ్యాయి.

ఈ ఘటన తర్వాత పలు రాష్ట్రాల్లో దర్యాప్తు వేగంగా జరుగుతున్న సమయంలోనే యూపీ ప్రభుత్వం ఈ కొత్త ప్రోటోకాల్‌ను అమలు చేసింది. ఇటీవలి నెలల్లో మదర్సాలు, ప్రైవేట్ మతపరమైన సంస్థల్లోకి ఇతర రాష్ట్రాల యువత పెద్దఎత్తున చేరుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. అందువల్ల, ఈ సంస్థలపై మరింత పరిశీలన అవసరం ఏర్పడింది. అదే కారణంగా మదర్సాల వివరాల ధృవీకరణ బాధ్యతను ఏటీఎస్ కు అప్పగించారు.

ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో భాగంగా లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీలో పనిచేసే లెక్చరర్ పేరు బయటకు రావడంతో ఆ విశ్వవిద్యాలయం కూడా విచారణలో భాగమైంది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీని నిఘా సంస్థలు ఈ వివరాలు సమర్పించమని ఆదేశించాయి: జమ్మూ కశ్మీర్‌కి చెందిన అధ్యాపకుల గుర్తింపు పత్రాలు, యూనివర్శిటీలో చదువుతున్న జమ్మూ కశ్మీర్ విద్యార్థుల రికార్డులు, విదేశీ విద్యార్థుల సంఖ్య, వారి కోర్సులు, విద్యార్థుల పూర్తి వివరాలు అందించాలి.

యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, రాష్ట్రంలో అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడం, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.