తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, పీఎం- కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమకానున్నాయి. యువత వ్యవసాయాన్ని ఆధునిక, విస్తరించదగిన అవకాశంగా గుర్తిస్తున్నారని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంతో శక్తివంతం చేస్తుందని ఆయన దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం 2025ను ప్రారంభిస్తూ చెప్పారు.
“వ్యవసాయ ఎగుమతులు దాదాపు రెండింతలయ్యాయి. వ్యవసాయాన్ని ఆధునికత దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతులకు సహాయం చేయడానికి అన్ని మార్గాలను విస్తృతంగా ప్రారంభించింది. రాబోవు సంవత్సరాల్లో భారత వ్యవసాయ రంగంలో అనేక భారీ మార్పులను చూడనున్నాం. ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ హబ్‌గా మారే దిశలో భారత్ పయనిస్తోంది” అని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
“మన జీవవైవిధ్యం కొత్త రూపు సంతరించుకుంటోంది. దేశ యువత వ్యవసాయాన్ని ఆధునికమైన, విస్తృతి కలిగిన అవకాశంగా చూస్తున్నారు. దీనివల్ల దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుంది” అని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు. దక్షిణ భారత సహజ వ్యవసాయ సమ్మిట్‌ను అద్భుతంగా నిర్వహించినందుకు తమిళనాడు రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.
“ప్రదర్శనను చూశా. అనేక మంది రైతులతో మాట్లాడే అవకాశం వచ్చింది. మెకానికల్ ఇంజినీరింగ్, పిహెచ్‌డీ పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నవారు, నాసా నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేస్తున్నవార. అందరూ యువతను శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాలేకపోయి ఉంటే నా జీవితంలో చాలా విషయాలు కోల్పోయే ఉంటాను. ఇక్కడికివచ్చి ఎంతో నేర్చుకున్నాను. తమిళనాడు రైతుల ధైర్యానికి, మార్పును స్వీకరించే శక్తికి సెల్యూట్ చేస్తున్నా” అని ప్రధాని మోదీ చెప్పారు.
అంతకుముందు కోయంబత్తూర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ తొలుత రోడ్ షో నిర్వహించారు. అనంతరం దక్షిణ భారతదేశ ప్రకృతి వ్యవసాయ సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సులో స్టాళ్లను పరిశీలించిన మోదీ, రైతులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులు, పండించిన పంటలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడిన ఆయన ప్రకృతి వ్యవసాయం గురించి ఆరా తీశారు.

More Stories
బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షునిగా నితిన్ నబిన్
సిడ్నీ బీచ్‌లో ఉగ్రదాడి- కాల్పుల్లో 12 మంది మృతి
శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఐఎస్ఐ నుంచి ముప్పు