2035నాటికి అందరికీ ఈ- పాస్‌ పోర్ట్‌లు

2035నాటికి అందరికీ ఈ- పాస్‌ పోర్ట్‌లు

దేశంలో ఇప్పటివరకు దాదాపు 80 లక్షల ఈ- పాస్‌ పోర్ట్‌లు జారీ చేశామని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. గడువు ముగియని పాత పాస్‌ పోర్ట్‌లు 2035 వరకు లేదా వాటి గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.   “ఈ పాస్ పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్‌ పీ) వెర్షన్‌ 2.0 ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో దాదాపు 80 లక్షల ఈ- పాస్‌ పోర్ట్లు జారీ అయ్యాయి. 2025 జూన్ నుంచి ఇప్పటివరకు దాదాపు 62,000 ఈ పాస్ పోర్ట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో ఉన్నవారికి జారీ అయ్యాయి” అని తెలిపారు. 

“ఒక వ్యక్తి ఈ-పాస్‌ పోర్ట్ పోయినా లేదా దొంగతనానికి గురైనా అతడి డేటాను ఎవరూ చోరీ చేయలేరు. పాస్ పోర్ట్ పోయినా లేదా దొంగతనం జరిగిన తర్వాత సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత ఈ పాస్ పోర్ట్ చిప్‌లోని మొత్తం డేటాను అధికారులు లాక్ చేస్తారు. అంతేకాకుండా ఈ పాస్‌ పోర్ట్‌లో ఉపయోగించే ఫోటో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.” అని విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

దేశంలోని పౌరులు, విదేశాల్లో నివసిస్తున్న వారి కోసం పాస్‌ పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్‌ పీ వెర్షన్ 2.O), గ్లోబల్ పాస్‌ పోర్ట్ సేవా కార్యక్రమం (జీపీఎస్ పీ వెర్షన్ 2.0), ప్రధాన పాస్‌ పోర్ట్ సేవా కార్యక్రమం (పీఎస్ పీ) అప్‌ గ్రేడ్ వెర్షన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ ఇటీవల ప్రకటించింది.  విదేశాల్లో ఈజీగా ఇమిగ్రేషన్, పాస్‌ పోర్ట్ కలిగిన వ్యక్తుల డేటాకు భద్రత కల్పించడం, నకిలీ పాస్‌ పోర్ట్‌లకు అడ్డుకట్ట వేయడం కోసం కేంద్రం ఈ- పాస్ పోర్ట్లను తీసుకొచ్చింది.

అయితే ఈ-పాస్‌ పోర్ట్ ప్రక్రియ కొత్తేమీ కాదు. ఇప్పటికే 100కు పైగా దేశాలు తమ పౌరులకు ఈ-పాస్‌ పోర్ట్‌లను ఇస్తున్నాయి.  ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాధారణ పాస్‌ పోర్ట్ తరహాలోనే ఈ-పాస్‌ పోర్ట్‌ను వాడుకోవచ్చు. డేటా భద్రత, విదేశాల్లో సులువైన ఇమిగ్రేషన్‌ ప్రక్రియ కోసం వీటిలో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చుతారు. ఇందులో పాస్‌ పోర్ట్ కలిగిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, వయసు, చిరునామా వంటి వివరాలుంటాయి.