డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా

డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించారు.

టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ధర్నాకు నేతృత్వం వహిస్తూ తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు ప్రొడ్యూసర్స్ తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల చిన్న సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ధ్వజమెత్తారు. సినిమాను థియేటర్స్ లో ప్రదర్శించే డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ వో, పీఎక్స్ డీ తెలుగు నిర్మాతల నుంచి వారానికి రూ. 10,000 వసూలు చేస్తుండడంతో ఒక్కో సినిమా రిలీజ్ కు కనీసం రూ. 10 లక్షలు నిర్మాతలు భారాన్ని మోయాల్సివస్తోందని చెప్పారు. 

 
మల్టీప్లెక్స్ లో అయితే వారానికి రూ. 15,000 నిర్మాత చెల్లించాలని చెబుతూ ఇదే పక్క రాష్ట్రాల్లో రూ. 2500 నుంచి రూ 3,000 మాత్రమే ఛార్జీలు ఉన్నాయని తెలిపారు. ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఈ డిజిటల్ ప్రొవైడింగ్ కంపెనీల్లో పార్టనర్స్ గా ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమను దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. థియేటర్ల లో వందల రూపాయలు తినుబండారాలకే ఖర్చువుతోందని, టికెట్ రేట్లు భారీగా ఉంటున్నాయని గుర్తు చేశారు. 
 
దీంతో సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమాను థియేటర్స్ లో చూసేందుకు రావడం లేదని చెబుతూ ఏడాదిలో విడుదలయ్యే 250 చిత్రాల్లో 200 చిన్న చిత్రాలే ఉంటున్నాయని చెప్పారు. అలాంటి  చిన్న సినిమా ఈ రోజున బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసారు.  కాగా, పైరసీ అరికట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను ఆయన  అభినందించారు.

నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ మాఫియాలా తయారయ్యారని విమర్శించారు. నిర్మాత డి ఎస్ రెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమా బ్రతకాలంటే డిజిటల్ చార్జీలు, థియేటర్స్ లో తినుబండారాల రేట్లు, టికెట్ చార్జీలు కంటెంట్ ప్రొవైడర్స్ రేట్స్, టికెట్ రేట్స్, తినుబండారాల రేట్స్ తగ్గించకపోతే  చిన్న నిర్మాతలెవరూ ఉండరని స్పష్టం చేశారు.

నటుడు, దర్శకుడు సిరాజ్ మాట్లాడుతూ చిన్న సినిమాకు థియేటర్స్ దొరకడం లేదని,  ఓటీటీ, శాటిలైట్ వాళ్లు తీసుకోవడం లేదని విమర్శించారు. డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చే ఊరి బయటి థియేటర్స్ కు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపరని చెప్పారు.