విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్య సాయిబాబా

విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్య సాయిబాబా
విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్య సాయిబాబా జీవించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.  పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలలో పాల్గొంటూ  బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా. ఆయన ప్రేమ మనతోనే ఉందని చెబుతూ  భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రం అని పేర్కొన్నారు.
 
భక్తి, జ్ఞానం, కర్మ ఈ మూడూ సేవతోనే ముడిపడి ఉంటాయని,  సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని ప్రధాని  వివరించారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు ఇదే బాబా నినాదమని, ఆయన బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుందని ఆయన తెలిపారు. కోట్లమంది బాబా భక్తులు మానవసేవ చేస్తున్నారని, బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయని చెప్పారు. 
 
చాలామంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారని, లక్షలమందిని బాబా సేవామార్గంలో నడిపించారని ప్రధాని మోదీ కొనియాడారు.  సత్యసాయి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మోదీ తెలిపారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని పేర్కొంటూ 20 వేల మంది బాలికలకు ఇవాళ సురక్ష సమృద్ధి యోజన అందించారని చెప్పారు.
 
బాలికల ప్రగతిలో సురక్ష సమృద్ధి యోజన కీలకమైందని వివరించారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన లబ్ధిదారుల సంఖ్య వంద కోట్లకు చేరిందని, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదంతో ముందుకెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పుట్టపర్తి పవిత్రభూమిలో ఏదో మహత్తు ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

ఆయన ఆశీస్సులతోనే తాగునీటి పథకం అందించామని చెబుతూ సత్యసాయి 102 విద్యాలయాలు, ఎన్నో వైద్యాలయాలు స్థాపించారని,  ప్రభుత్వాల కంటే వేగంగా ఆయనే స్పందించేవారని, 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారని ప్రధాని గుర్తు చేశారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్‌ సేవలందిస్తోందని, సత్యసాయి ట్రస్టుకు 7లక్షల మందికిపైగా వాలంటీర్లు ఉన్నారని పేర్కొన్నారు.

సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని, సత్యసాయి చూపిన మార్గంలో మనం ముందుకెళ్లాలని ప్రధాని వివరించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.  క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌ తదితరులు హాజరయ్యారు.