2015-16 గ్రూప్-2ను రద్దు చేస్తూ మంగళవారం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్, వైట్‌నర్ వినియోగం, తుడిపివేతలున్న పార్ట్-బి పత్రాలను పునర్ మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు లేదని తేల్చి చెప్పింది.
జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తేల్చి చెప్పింది. 2019 అక్టోబరు 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని వాటిని రద్దు చేసింది. సాంకేతిక కమిటీ సిఫార్సులు, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ఈ ప్రక్రియను 8వారాల్లో పూర్తి చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
దిద్దుబాటు, వైట్‌నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ జరిపిన వాటిని మూల్యాంకనం చేయడం ద్వారా చేపట్టిన నియామకాలను రద్దు చేయాలంటూ పలువురు దాఖలు చేసిన 6 పిటిషన్‌లపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి ఈమేరకు తీర్పు వెలువరించారు. గ్రూప్-2 కింద 13 కేటగిరీల్లో 1,032 పోస్టుల భర్తీకి 2015 నోటిఫికేషన్ జారీ కాగా 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ అయింది. 2016 నవంబరు 11, 13 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి.
ప్రశ్నపత్రం బుక్‌లెట్‌కు, ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి 2016 డిసెంబరులో కమిషన్ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యయనం చేసి 2017 మార్చిలో నివేదిక సమర్పించింది. ప్రశ్న పత్రంలోని బుక్‌లెట్ నంబరు, ఓఎంఆర్ నంబరు ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ నివేదికలో పేర్కొంది.
ఓఎంఆర్ షీట్ పార్ట్-ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి చిన్నచిన్న పొరపాట్లు ఉంటే మన్నించవచ్చని అయితే పార్ట్-బీలోని 150 ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత, వైట్‌నర్ వాడినట్లయితే వాటిని మూల్యాంకనం చేయరాదని కమిటీ సిఫార్సు చేసింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్-ఏ లోని తప్పులను సరిదిద్దడానికే సాంకేతిక కమిటీ, హైకోర్టు అనుమతించిందని పేర్కొంది.

More Stories
నల్లగొండలో రైతు దీక్షను విరమింపచేసిన ఏలేటి
జాతీయ జల అవార్డులలో అగ్రగామిగా తెలంగాణ
హనుమంతుడిని అవమానించారని రాజమౌళిపై కేసు