నల్లగొండలో రైతు దీక్షను విరమింపచేసిన ఏలేటి

నల్లగొండలో రైతు దీక్షను విరమింపచేసిన ఏలేటి

బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ వద్ద బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 24 గంటల పాటు చేపట్టిన రైతు నిరాహార దీక్ష కార్యక్రమానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.  అనంతరం నిరాహార దీక్ష చేస్తున్న నాయకులతో దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 
 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వరంగల్  డిక్లరేషన్ లో  చేసిన హామీలను వెంటనే అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు . రైతులు కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో చేతికి రాకుండా పోవడం బాధాకరం చెప్పారు. పంట నష్ట పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో నష్ట్ర పరిహారం ఇవ్వడంలేదని, కనీసం కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన అమలుపరిస్తే రైతులకు మేలు జరుగుతుందని విమర్శించారు. 
 
ఫసల్ బీమా యోజనను రాష్ట్రం లో అమలు పరచకుండా రైతులను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని ధ్వజమెత్తారు.  పంట కొనుగోలులో కూడా తప్ప తరుగు పేరిట సంచికి 2 నుంచి 3 కిలోలు దాదాపు క్వింటాల్ కు 7 కిలోల మేర అంటే ఈ రాష్ట్రంలో కొనుగోలు చేసే ధాన్యంలో 7% పైగా  తూకంలో కట్ చేసి సంవత్సరానికి 2800 కోట్ల  భారీ కుంభకోణం సివిల్ సప్లై శాఖలో  చేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
మరి ఈ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? సమాధానం చెప్పాలని నిలదీసేరు.  రైతు సంఘాల లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. 5 లక్షల ఎకరాలకైనా పంట నష్ట పరిహారం ఇస్తారనుకుంటే, కేవలం 1 లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మంత్రి చేస్తున్నారు. అది కూడా కేవలం ఎకరానికి 10 వేలు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
 
ఎకరానికి పెట్టుబడి 30 నుండి 40 వేలు ఐతే కనీసం పెట్టుబడి సాయం చేయకుండా ఎగ్గొట్టి, ఇప్పుడు నష్ట పరిహారం సైతం 10వేలు ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని ఏలేటి మండిపడ్డారు. ఒక సీజన్ రైతు బందు ఎగొట్టారు, రెండు సీజన్ ల బోనస్ ఎగ్గొట్టారు.  వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లకు ఇస్తామంటూ ముఖ్యమంత్రి మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
బూటకపు మాటలు చెప్తూ ప్రజలను, రైతులను మోసం చేయాలని చూస్తున్నారని పేర్కొంటూ స్థానిక ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రిజర్వేషన్ లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు . ఒక పక్క అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను మహిళలను ఇలా అన్ని వర్గాలను ఈ ప్రభుతం మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
విద్యార్థులకు దాదాపు 10వేల కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా  మోసం చేస్తున్నారని, మహిళలకు 2500 లు, విద్యార్థులకు స్కూటీ లు, నిరుద్యోగులకు భృతి,  ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ఉద్యమాల గడ్డ నల్గొండ మీద మొదలైన ఈ ఉద్యమం ప్రతీ జిల్లాకు విస్తరింప జేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, చెల్లా శ్రీలత రెడ్డి కూడా పాల్గొన్నారు.