స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ రిజర్వేషన్ కోటా పరిమితులను ఉల్లంఘిస్తే ఎన్నికలను నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

2022లో జేకే బాంథియా కమిషన్ తన నివేదికలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. దానికంటే ముందున్న పరిస్థితి ప్రకారం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.  అయితే మహారాష్ట్ర సర్కార్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు తదుపరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది. అయితే ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది.

“ఇప్పటికే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, కోర్టు తన ఆర్డర్ను నిలిపివేయాలన్నదే పిటిషన్ సారాంశమైతే, మేము ఎన్నికలను నిలిపివేస్తాం. ఈ సర్వోన్నత న్యాయస్థానం అధికారాలను మీరు పరీక్షించవద్దు. రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని మేము ఎప్పుడూ పెంచాలని అనుకోలేదు” అని స్పష్టం చేసింది. 

“ఈ ధర్మాసనంలో కూర్చున్న మేము అలా చేయలేము కూడా. బాంథియా కమిషన్ నివేదిక ఇప్పటికీ సబ్-జ్యూడిస్ పరిధిలో ఉంది. అందుకే అంతకు ముందు ఉన్న పరిస్థితి ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి మేము అనుమతిస్తున్నాం” అని మహారాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కొన్ని సందర్భాల్లో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో 70 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.