వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడికి ముందు ఈ ఉగ్ర ముఠా భారీ ఆయుధాలతో కూడిన డ్రోన్లతో రద్దీ ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్రణాళిక రచించింది. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి తరహాలో దాడులకు పాల్పడాలని వీరు ప్రయత్నించారు.
సూసైడ్ బాంబర్, డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి పని చేసిన జసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్ ఈ భయానక వివరాలను వెల్లడించాడు. ఇతనిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం శ్రీనగర్‌లో అరెస్ట్ చేసింది. కారు బాంబు పేలుడుకు ముందే, డ్రోన్లకు భారీ ఆయుధాలను అమర్చి, రాకెట్లను తయారు చేసి, రద్దీ ప్రదేశాల్లో దాడులకు పాల్పడేందుకు సాంకేతిక సహకారాన్ని డానిష్ అందించాడని ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.
సూసైడ్ బాంబర్ ఉమర్‌తో సహ కుట్రదారుగా డానిష్ పని చేసినట్లు తెలిపింది. మీడియా కథనాల ప్రకారం, పెద్ద బ్యాటరీలతో అత్యంత శక్తిమంతమైన బాంబులను తీసుకెళ్లగలిగే డ్రోన్లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన డ్రోన్లను తయారు చేయడంలో అతనికి అనుభవం ఉంది. రద్దీ ప్రదేశాల్లో డ్రోన్ల దాడి చేయాలని నిందితులు ప్రయత్నించారు.
గతంలో అరెస్టు చేసిన అనుమానితులను విచారించిన, సాంకేతిక దర్యాప్తు ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా అరెస్టు చేసింది. ఎన్‌ఐఏ బృందం గత కొద్దిరోజులుగా కశ్మీర్‌లో లోయలో దాడులు చేస్తూ అనుమానితులను విచారిస్తున్నది. ఈ సమయంలో జాసిర్ వాని ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే అమీర్ రషీద్ అలీని ఎన్‌ఐఏ గతంలో ఢిల్లీలో అరెస్టు చేసింది. పేలుడుకు ఉపయోగించిన కారు అతని పేరుతోనే రిజిస్టర్ అయ్యింది. అతని నెట్‌వర్క్, ఇందులో పాల్గొన్న వ్యక్తుల కోసం ఎన్‌ఐఏ ఆరా తీస్తున్నది. కార్ బాంబు దాడికి ముందు డానిష్ ఉగ్రదాడులకు సాంకేతిక మద్దతు ఇచ్చాడు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ఖాజిగండ్ నివాసి అయిన నిందితుడు జాసిర్ వని ఈ దాడిలో యాక్టివ్ కుట్రదారుడు.
ఉగ్రవాది ఒమర్ ఉన్ నబీతో కలిసి అతను ఈ ఉగ్రవాద మారణహోమాన్ని ప్లాన్ చేశాడు. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్‌లోని ఖాజీగుండ్‌కు చెందిన జసిర్, డ్రోన్లు, రాకెట్ల తయారీలో నిపుణుడు. ఉగ్రదాడుల కోసం డ్రోన్లలో మార్పులు చేర్పులు చేసేందుకు సాంకేతిక సాయం అందించాడని, రాకెట్ల తయారీకీ యత్నించాడని ఎన్‌ఐఏ వెల్లడించింది. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో సహ కుట్రదారుడిగా వ్యవహరించాడని, ఈ దాడి ప్లాన్‌లో ఉమర్‌తో కలిసి పనిచేశాడని వివరించింది.
తాను గత ఏడాది అక్టోబర్‌లో కుల్గాంలో ఉగ్ర నెట్‌వర్క్ సభ్యులను కలిశానని, అక్కడి నుంచి తనను అల్ ఫలా విశ్వవిద్యాలయంలోని అద్దె వసతి గృహానికి తీసుకెళ్లారని జాసిర్ చెప్పాడు. “నన్ను ‘జైషే మహమ్మద్’ ఉగ్రసంస్థకు సహాయకుడిగా (ఓవర్ గ్రౌండ్ వర్కర్)గా ఉంచాలని టెర్రర్ మాడ్యూల్‌లోని ఇతర సభ్యులు కోరుకున్నారు. కానీ, ఉమర్ మాత్రం నన్ను ఆత్మాహుతి బాంబర్‌గా మారేలా ఒప్పించేందుకు చాలా నెలలు ప్రయత్నించాడు” అని జాసిర్ తెలిపాడు. అయితే వివిధ కారణాలతో జాసిర్ వెనక్కి తగ్గడంతో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు.
మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ముందుగా జసిర్‌తోపాటు అతడి తండ్రి, డ్రైఫ్రూట్స్ విక్రేత బిలాల్ అహ్మద్ వనీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారించిన అనంతరం విడిచిపెట్టారు. అయితే, ఆదివారం ఆయన తనకు తాను నిప్పంటించుకోవడంతో తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
15కు చేరిన మృతుల సంఖ్య
కాగా, ఎర్ర కోట వద్ద ఈ నెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో గాయపడిన మరో ఇద్దరు తుది శ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 15కు పెరిగింది.
ఢిల్లీ ఎర్రకోట ఉగ్ర పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
25ఏండ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని మహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో నిందితుడైన హమూద్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంకును స్థాపించిన హమూద్.. ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని వందల సంఖ్యలో డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్టు అభియోగాలు ఉన్నాయి.

More Stories
బీహార్ ఓటమితో కర్ణాటక సీఎం మార్పుకు కాంగ్రెస్ వెనకడుగు!
డాక్టర్ ఉమర్ నబీ రెండు `మిస్సింగ్ ఫోన్లు’ కీలకం!
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై రాహుల్ గాంధీ భయంకర కుట్రలు!