రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని మల్కాజిగిరి బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా ప్రజా సంక్షేమం దిశగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెబుతూ నగరంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సూచించారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి కనెక్షన్లను విస్తరించకపోవడంతో ప్రజలు ప్రతిరోజూ తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యతో గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ ముందుచూపు లోపానికే నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే జూబ్లీహిల్స్ లో బిజెపి ఓటమి పాలైందని రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ లో ఓటమితోనే బిజెపి పనైపోయినట్లు కాదని స్పష్టం చేశారు. హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార పార్టీ డబ్బు, చీరలు పంపిణీ చేసి అధికార దుర్వినియోగం చేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు. నగరంలోని సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ వ్రాస్తానని, అవసరమైతే కలిసి విన్నవిస్తానని రాజేందర్ తెలిపారు. నగరవ్యాప్తంగా ఏ రోడ్డు చూసిన గంటలపాటు ట్రాఫిక్ మయంగా రోడ్లు కిక్కేసిపోతున్నాయని చెప్పారు.
తాజా వర్షాలతో రోడ్లు అస్తవ్యస్తంగా మారి, ఎక్కడ చూసినా గుంతలు, దెబ్బతిన్న రహదారులు ప్రజలకు మరింత ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సరిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర విడిచి పనిచేయాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే అధికారులను గుప్పిట్లో పెట్టుకుని, పోలీసులతో అమాయక డ్రైవర్లపై అనవసరమైన చాలానాలు వేయడం సరికాదని ఆయన విమర్శించారు. త్రాగునీటి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో పాటు, సరైన సమయంలో నీరు సరఫరా చేయకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యమే అని స్పష్టం చేశారు.
డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న కారణంగా మురుగునీరు రోడ్లపైకి రావడం, చెరువుల్లో పడటం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సరిదిద్దడం, త్రాగునీటి సరఫరా మెరుగుపరచడం వెంటనే చేపట్టాలని, అలాగే నిర్మాణం పూర్తిగా ముగిసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అసలైన లబ్ధిదారులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు

More Stories
పాత రిజర్వేషన్ల విధానంలోనే డిసెంబర్ లో స్థానిక ఎన్నికలు
సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి
అనర్హత విషయంలో స్పీకర్ పై `సుప్రీం’ ఆగ్రహం