డాక్టర్ ఉమర్ నబీ రెండు `మిస్సింగ్ ఫోన్లు’ కీలకం!

డాక్టర్ ఉమర్ నబీ రెండు `మిస్సింగ్ ఫోన్లు’ కీలకం!

ఢిల్లీ పేలుడులో మరణించిన అనుమానాస్పద “సూసైడ్ బాంబర్” డా. ఉమర్ ఉస్ నబీ చివరి క్షణాల్ని గుర్తించేందుకు విచారణ అధికారులు ఇప్పుడు అతను చివరిగా వినియోగించిన రెండు మొబైల్ ఫోన్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు దొరికితే అతనికి ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరు? డబ్బు ఎవరు ఇచ్చారు? ఈ దాడి పెద్ద కుట్రలో భాగమా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఉమర్ గత నెలాఖరులో హర్యాణాలోని ఒక మెడికల్ షాపులో రెండు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించాడు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు అతను ఉపయోగించిన ఈ రెండే ఫోన్లు ఇప్పుడు దర్యాప్తులో “మిస్సింగ్ లింక్”గా మారాయి. అతనికి సంబంధించి ఢిల్లీ, ఫరీదాబాద్, మీవాట్ ప్రాంతాల్లో మొత్తం ఐదు ఫోన్ నంబర్లను గుర్తించారు. కానీ చివరిలో ఉపయోగించిన రెండు ఫోన్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

గత వారం నుంచి ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ సెల్, జమ్మూ–కాశ్మీర్ పోలీస్ సంయుక్తంగా ఉమర్ చివరి 36 గంటల ప్రయాణాన్ని నిమిషానికోసారి రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫరీదాబాద్ నుంచి నూహ్ మీదుగా ఢిల్లీ వరకు అతని కదలికలను సీసీటీవీ విజువల్స్, టవర్ డంప్స్, ఎన్క్రిప్టెడ్ చాట్ లాగ్స్, సాక్షుల వాంగ్మూలాలతో మ్యాచ్ చేస్తున్నారు. అక్టోబర్ 30న అతని ప్రధాన నంబర్లు రెండూ డీయాక్టివేట్ అయ్యాయి.

అదే రోజు ఉమర్‌కు సన్నిహితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్ట్ కావడంతో, ఉమర్ వెంటనే ట్రేస్ అవగలిగే ఫోన్లను వదిలి, తప్పుడు ఐడెంటిటీలతో కొనుగోలు చేసిన రెండు ప్రీపెయిడ్ నంబర్లకు మారినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అత్యంత ముఖ్యమైన క్లూ ధౌజ్ మార్కెట్  సీసీటీవీ నుంచి వచ్చింది. అల్ఫలాహ్ యూనివర్సిటీకి దగ్గరలోని ఈ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాపులో ఉమర్ నల్ల బ్యాగ్‌తో కూర్చుని రెండు ఫోన్లు ఉపయోగిస్తున్నాడు. ఒకదాన్ని చార్జింగ్‌కు ఇస్తూ, మరోదాన్ని చేతిలో పట్టుకుని ఉన్నాడు.

దర్యాప్తు బృందం అర్థం చేసుకున్న ప్రకారం ఒక ఫోన్ సాధారణ కమ్యూనీకేషన్ కోసం, మరొకటి అతని హ్యాండ్లర్స్ తో “ఆపరేషన్ మెసేజింగ్” కోసం.  అక్కడి నుంచి ఖలీల్‌పూర్, రెవాసన్ టోల్ ప్లాజాలు, ఫరీదాబాద్, చివరకు ఢిల్లీ వరకు మొత్తం 65కి పైగా సీసీటీవీ క్లిప్స్ పరిశీలించారు. కానీ నవంబర్ 9 రాత్రి తర్వాత తుర్కమాన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్ ఇలాహీ మస్జిద్‌లోనూ, పేలుడు జరిగిన రెడ్ ఫోర్ట్ పార్కింగ్ లాట్‌లోనూ ఆ ఫోన్లు ఎక్కడా కనిపించలేదు.

ఇది రెండు అవకాశాలు సూచించిందని అధికారులు అంటున్నారు.  అతను ఫోన్లు ఎవరికైనా అప్పగించి ఉండవచ్చు లేకపోతే పేలుడుకు ముందు వాటిని పారవేసివుండవచ్చు ఫైజ్ ఇలాహీ మస్జిద్‌లో 15 నిమిషాలు గడిపినప్పుడు అతను ఎవరితోనూ మాట్లాడలేదని స్టాఫ్ చెబుతున్నా, దర్యాప్తు బృందం మాత్రం ఆ సమయంలో జరిగిన “డేటా గ్యాప్”ను అనుమానిస్తోంది.

“డేటా లేకపోవడమే ఒకరకమైన సాక్ష్యం” అని సీనియర్ ఆఫీసర్ పేర్కొన్నారు. అందుకే నవంబర్ 10న అదే సమయంలో మస్జిద్‌లోకి వచ్చిన వారందరి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఎవరికైనా ఉమర్ ఫోన్లు ఇచ్చిన అవకాశముందో లేదో పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత ఉమర్ తన తెలుపు రంగు హ్యుండయ్ ఐ20లో నేరుగా రెడ్ ఫోర్ట్‌కి వెళ్లి కెమెరాలు లేని పార్కింగ్ జోన్ లో వాహనం నిలిపాడు.

టవర్ డంప్స్‌లో నూహ్, తుర్కమాన్ గేట్ ప్రాంతాల్లో రెండు అనుమానాస్పద నంబర్లను గుర్తించారు. వీటి కదలికలు ఉమర్ ప్రయాణంతో సమాంతరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉమర్ ఎన్క్రిప్టెడ్ యాప్స్ సిగ్నల్, బ్రియార్, ఎలిమెంట్ మాత్రమే వాడేవాడని దర్యాప్తు బృందం చెబుతోంది. “డెలివరీ”, “షిప్‌మెంట్”, “టెస్టింగ్” వంటి కోడ్ మాటలను ముజమ్మిల్ ఫోన్‌నుంచి రికవరీ చేశారు. 

పోలీసుల మాటల్లో “ఈ ప్రవర్తన ఒకే వ్యక్తి ఉగ్రవాద భావజాలం కాదు. ఎవ్వరో శిక్షణ పొందినవారు విధానం”. నవంబర్ 10 తెల్లవారుజామున 1:07 గంటల  సమయంలో నూహ్ జిల్లా ఫిరోజ్‌పూర్ జిర్కా వద్ద ఉన్న హెచ్ డి ఎఫ్ సి ఏటీఎంలో నుంచి ఉమర్ రూ. 76,000 నగదు తీసుకున్నాడు. గ్యార్డు ప్రకారం అతను ఆందోళనతో, త్వరగా వెళ్లిపోవాలనే ఉత్కంఠలో ఉన్నాడు. కారులో బెడ్‌షీట్‌తో కప్పిన వస్తువులు కూడా ఉన్నాయని తెలిపాడు.

ఈ డబ్బు అతని ఆపరేషన్ కు చివరి సంసిద్ధతను సూచికగా పోలీసులు భావిస్తున్నారు. రెడ్ ఫోర్ట్ పేలుడు ప్రదేశం దగ్గర నుంచి ఫొరెన్సిక్ బృందాలు రెండు లైవ్ కార్ట్రిడ్జ్ లు, ఒక ఖాళీ 9 ఎంఎం షెల్ లను స్వాధీనం చేసుకున్నాయి. ఇవి సాధారణంగా భద్రతా సిబ్బంది వాడే రకాలే.
పేలుడు ప్రదేశంలో గన్ ఫ్రాగ్మెంట్స్ దొరకకపోవడంతో ఇది దర్యాప్తులో కొత్త కోణాన్ని తెచ్చింది.

పోలీసులు రెండు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఉమర్ వద్ద ఆయుధం ఉన్నదా? ఆ గన్‌ను రెడ్ ఫోర్ట్‌కు చేరుకునే ముందు ఎక్కడో పారేసేశాడా? లేదా మరొక వ్యక్తి ఉన్నాడా?