అసోంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ

అసోంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
 

అస్సాంలో ఓటర్ల జాబితా ఎస్‌ఐఆర్‌ను చేపట్టాలని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఇసిఐ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2026, 1 జనవరి వరకు అస్సాం ప్రత్యేక సవరణను నిర్వహించడానికి అర్హత తేదీగా ఉంటుందని ఇసి పేర్కొంది. స్పెషల్‌ రివిజన్‌ యాన్యువల్‌ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌), ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితాల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. 

 
స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) అంటే ఓటరు జాబితాను సమీక్షించడం, ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల ఉంటుంది. తుది ఓటర్ల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రచురిస్తామని వెల్లడించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో ప్రత్యేక సవరణ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
 
ఇది అర్హత ఉన్న పౌరులందరికీ స్పష్టమైన, అప్‌డేట్‌ చేసిన ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేయడంలో సహాయపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సవరణ పారదర్శకంగా, సకాలంలో పూర్తయ్యేలా ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
 
ఇసిఐ గత నెలలో ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, పుదుచ్చేరి, అండమాన్‌, నికోబార్‌ దీవులు మరియు లక్షద్వీప్‌లలో ఎస్‌ఐఆర్‌ చేపట్టనున్నట్లు గత నెల ఇసిఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ మరియు పశ్చిమబెంగాల్‌లో 2026లో ఎన్నికలు జరగనున్నాయి. కానీ 2026లోనే  ఎన్నికలు జరగనున్న అస్సాంకి మాత్రం  వేరుగా  ఎస్‌ఐఆర్‌ ప్రకటించింది.