ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను చూస్తాం

ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను చూస్తాం
 
ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను భారత్​ ఒకే విధంగా చూస్తుందని  భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశా రు. భారత్​ను లక్ష్యంగా చేసుకొన్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తే అది పొరుగు దేశానికే నష్టమని ఆయన హెచ్చరించారు. భారత్ తమ​ ప్రజల శ్రేయస్సుపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని, ఆ మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని చూస్తే అందుకు తగిన విధంగా ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పారు. 
 
తాము కోరుకుంటున్నదల్లా శాంతియుత ప్రక్రియను అవలంభించాలని, అందుకు తాము కూడా సహకరిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పాకిస్థాన్‌తో వ్యవహరించడంలో భారత్​ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘చాణక్య డిఫెన్స్​ డైలాగ్స్​’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ  ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్ కేవలం 88 గంటల ట్రైలర్‌ మాత్రమేనని చెప్పారు. 
 
దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. .​  భారత్​ ఎలాంటి బెదిరింపులకు లొంగదని, భారత పురోగతికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే అందుకు తగ్గ చర్యలు తీసుకోవడానికి భారత దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
 
“ఆపరేషన్ సిందూర్ అనేది ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకైనా మేము సిద్ధంగా ఉన్నాం. పాకిస్థాన్ అవకాశం ఇస్తే, పొరుగు దేశంతో బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాం. నేటి కాలంలో యుద్ధం వస్తే అది ఎంతకాలం కొనసాగుతుందో మనం చెప్పలేం. అందుకు తగ్గ సామాగ్రి మన వద్ద ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే నాలుగు సంవత్సరాలు పాటు జరిగే దీర్ఘకాలిక యుద్ధాలకు సైతం​ ఆహారం, మందుగుండు సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి” అని తేల్చి చెప్పారు.కాగా, రెండు సంవత్సరాలుగా హింసను ఎదుర్కొంటున్న మణిపుర్​లో పరిస్థితులు చాలా వరకు మెరుగుపడుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మణిపుర్​ను సందర్శించవచ్చునని పేర్కొన్నారు. సెప్టెంబర్​ ప్రారంభంలో ప్రధాని మోదీ మణిపుర్​ను సందర్శించారని, అక్కడి నివాసితులతో మాట్లాడారని గుర్తు చేశారు.  మరోవైపు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయన్నారు. ఉగ్రవాదం చాలా వరకు తగ్గిందని అభిప్రాయపడ్డారు.

చైనాతో సంబంధాలు బలపడ్డాయి!

మరోవైపు చర్చల అనంతరం అక్టోబర్​ నుంచి భారత్​- చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని ఆర్మీచీఫ్​ చెప్పారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ మధ్య ఇటీవల జరిగిన సమావేశాల్లో వివాదాల పరిష్కారం గురించి ప్రధానంగా చర్చించారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు 2024 ఆగస్టులో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన మోదీ, జిన్​పింగ్​ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 
 
అదే ఏడాది అక్టోబర్​లో కజాన్​లో జరిగిన చివరి సమావేశం ఇరుదేశాల మధ్య సానుకూల ఫలితాలను ఇచ్చాయి. భారత్​, చైనాలు ప్రత్యర్థులు కాదని అభివృద్ధి భాగస్వాములని ఇరుదేశాధినేతలు పునరుద్ఘాటించారు. విభేదాలు వివాదాలుగా మారకూడదని అంగీకరించారు.