సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్‌ వాసులు మృతి

సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్‌ వాసులు మృతి
సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మదీనాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందారు.  సోమవారం తెల్లవారు జామున భారతీయ యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ వాడుతుండగా  వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి.

మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.  “మొత్తం 54 మంది బృందం నవంబరు 9న హైదరాబాద్‌ నుంచి జెడ్డాకు వెళ్లింది. నవంబరు 23 వరకు టూర్‌ ప్లాన్‌ చేశారు. వీరిలో నలుగురు వ్యక్తులు ఆదివారం కారులో మదీనాకు వెళ్లారు. మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయల్దేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అబ్దుల్‌ షోయబ్‌ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడు’’ అని సజ్జనార్‌ తెలిపారు.

 సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసులు ఉన్నారన్న సమాచారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్​, డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. 

అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీఎస్​ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న కో ఆర్డినేషన్​ సెక్రటరీ గౌరవ్​ ఉప్పల్​ను అప్రమత్తం చేశారు. అలాగే జెడ్డాలో ఉన్న కాన్సులేట్​ జనరల్​, రియాద్​లోని డిప్యూటీ అంబాసిడర్​తో మాట్లాడారు.

ఈ ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘మదీనా రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృత్యువాత పడటం బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబసభ్యులకు నా ప్రగాఢసానుభూతి. గాయపడ్డ వారు అత్యంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రియాద్‌లో ఇండియన్ ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ సాయం అందిస్తున్నాయి. భారత అధికారులు సౌదీ అధికారులతో ఈ ప్రమాదం గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నారు’ అని పేర్కొన్నారు.\