ఈ దేశంలోని చివరి పౌరుడి వరకు న్యాయం అందాలని, ఇది న్యాయవ్యవస్థ బాధ్యత అని గవాయ్ స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో కోర్టుల పాత్ర కీలకమని.. హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెబుతూ మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతమైన అమరావతి నుంచి వచ్చి న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని చేపట్టానంటే.. అందుకు భారత రాజ్యాంగమే కారణమని చెప్పారు.
“రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగానే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కేఆర్ నారాయణన్, రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా చేశారు. మొదటిసారి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు. ఆమె కేవలం మహిళ మాత్రమే కాదు. గిరిజన సమాజానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యాంగం వల్లే ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. మీ సొంత రాష్ట్రం నుంచి ఎస్సీ వర్గానికి చెందిన బాలయోగి లోక్‌సభ స్పీకర్ అయ్యారు. అలానే మహిళా స్పీకర్‌గా మీరాకుమారి బాధ్యతలు నిర్వహించారు” అని ఆయన గుర్తు చేశారు.
రాజ్యాంగం వల్లే ఎస్సీ వర్గాలకు చెందిన వివిధ రాష్ర్టాల్లో సీఎ్‌సలు, డీజీపీలు అయ్యారని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నాలుగు స్తంభాలు మన రాజ్యాంగానికి మూలాధారాలని తెలిపారు. 75 ఏళ్లుగా శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు.. సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
“రాజ్యాంగం స్థిరమైన పత్రంగా ఉండకూడదని, వికాసం చెందుతూ సజీవపత్రంగా ఉండాలని అంబేడ్కర్ భావించారు. సామాజిక, ఆర్థిక సవాళ్లకు సమాధానం ఇవ్వడాన్ని అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించేందుకు వీలు కల్పించారు. 1951లో మొదటిసారి రాజ్యాంగానికి పార్లమెంటు సవరణ చేసింది. సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకే ఉందని చెప్పింది. సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేస్తూనే వస్తోంది” అని జస్టిస్ గవాయ్ వివరించారు.
“రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత రాజ్యాంగ లక్ష్యాలకు సంబంధించి 1946 డిసెంబరు 9న జవహర్‌లాల్ నెహ్రూ తీర్మానం ప్రవేశపెట్టగా అందులో లోపాలు ఉన్నాయని అంబేడ్కర్ ఎత్తిచూపారు. పౌరుల హక్కుల గురించి మాత్రమే ప్రస్తావించి, పరిష్కారాలు చూపనప్పుడు హక్కుల కల్పనకు అర్థం ఉండదన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు వీలుగా రాజ్యాంగంలో 32వ అధికరణను చేర్చారు” అని జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు.
మహిళలపై అసమానత రూపుమాపేందుకు జ్యోతి రావ్ ఫులే ఎంతో కృషి చేశారని, పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలకు సమానత్వం ఉండాలనేది సుప్రీంకోర్టు విధానం. న్యాయ రంగంలో మహిళలు రాణిస్తుండడం అభినందనీయమని అని తెలిపారు.
రాజ్యాంగ స్పూర్తికి, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు, దేశాభివృద్దికి, ప్రజల సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యంగం అనేది ఒక స్థిరమైన, దృడవమైన డాక్యుమెంట్ కాదని, కాలానుగుణంగా దాన్ని సవరించుకుంటూ ఎల్లప్పుడూ మనుగడ సాగించే జీవ పత్రమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకిచ్చారని, దానివల్లననే ఓ ఛాయ్ వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో నిఫుణులను అందించే సత్తా భారత్‌కు వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని వెల్లడించారు.
వ్యవస్థలోని లోపాను సరిదిద్ది న్యాయవ్యవస్థ కీలక బాధ్యత వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More Stories
ఉగ్రవాదంలో సాంకేతిక ముప్పు వెల్లడిస్తున్న ఢిల్లీ పేలుడు
ఢిల్లీ పేలుళ్ల తర్వాత 12 మంది వైద్యుల ఫోన్లు స్విచ్ఛాప్
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ