యుపిలో ఇండియా కూటమి భవిష్యత్ పై బీహార్ ప్రభావం!

యుపిలో ఇండియా కూటమి భవిష్యత్ పై బీహార్ ప్రభావం!
బీహార్ ఎన్నికలలో చావుదెబ్బ తిన్నతర్వాత బిజెపి అత్యంత బలోపేతంగా ఉన్న ప్రధాన ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఇక ఇండియా కూటమి పరిస్థితి ఏమిటనేది కీలక ప్రశ్న అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఐక్యత, ప్రత్యేకించి , ఇతర పార్టీలు కాంగ్రెస్‌తో కూటమి కట్టడం వంటి వాటిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి భవితవ్యం ఏమిటనేది కీలక ప్రశ్నగా మారింది. రాజకీయంగా అత్యంత కీలకమైన యుపిలో అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరుగుతాయి. 2024లోక్‌సభ ఎన్నికల దశలో కాంగ్రెస్, ఎస్‌పి ఇతర పార్టీల ఎన్నికల సర్దుబాట్లతో ఇండియా కూటమి రంగంలోకి దిగింది. ఈ దశలో బిజెపి ఆధిపత్యానికి సవాలు విసిరింది. ఎన్‌డిఎకు వ్యతిరేకంగా నిలిచి తగు సీట్లు పొందింది. 
 
అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలలో మహాఘట్‌బంధన్ ఫార్మూలా పనిచేయలేదు. మరింత బలోపేతం అయిన బిజెపి ఇప్పటి నుంచే యుపిపై ఎక్కువగా తన శక్తియుక్తులను కేంద్రీకృతం చేసుకుంటోంది. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో రాజకీయ దాడికి దిగుతున్నారు. పార్టీని ముస్లిం లీగ్, మావోయిస్టు పార్టీ అని, త్వరలోనే పార్టీలో చీలిక వస్తుందని చెప్పడం అత్యంత వ్యూహాత్మక రాజకీయ పరిణామం అయింది. 
 
ప్రత్యేకించి కాంగ్రెస్‌లో అంతర్గతంగానే కాకుండా, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలోనూ కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలా? వద్దా అనే రాజకీయ ధర్మసందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ ఇండియా కూటమి వైపు మొగ్గుచూపుతూ వస్తున్న కొన్ని ప్రాంతీయ బలీయ పార్టీల నాయకులు ఇండియా కూటమిలో సాగాలా? వీడాలా? అనే సందిగ్ధంలో పడుతున్నారని రాజకీయ వర్గాలు తెలిపాయి. 
 
అయితే బీహార్ ఎన్నికల ఫలితాలు యుపిపై పడబోవని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చెప్పారు. బిజెపి ఓ పార్టీ కాదు, ఓ ఫ్రాడ్ అని, బీహార్ ఫలితంపై సమీక్షించుకుని ఇక్కడ తగు వ్యూహాలు రూపొందించుకుంటామని చెప్పారు. ఇప్పటికిప్పుడు యుపిలో పరిస్థితిపై చెప్పడానికి ఏమి లేదని, పరిస్థితిని సమీక్షించుకుంటామని యుపి పిసిసి అధ్యక్షులు అజయ్ రాయ్ తెలిపారు.