ట్రంప్ గాజా శాంతి ప్రణాళికపై ఐరాసలో సోమవారం ఓటు

ట్రంప్ గాజా శాంతి ప్రణాళికపై ఐరాసలో సోమవారం ఓటు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గాజా శాంతి ప్రణాళికను ఆమోదించే తీర్మానంపై ఐక్యరాజ్యసమితిభద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) సోమవారం ఓటు వేయనుందని దౌత్యవేత్తలు తెలిపారు. ఇజ్రాయిల్‌, గాజా మధ్య రెండేళ్ల యుద్ధానికి ముగింపుగా కాల్పుల విరమణకు సంబంధించి, ట్రంప్‌ ప్రణాళికను ఆమోదించడంపై గతవారం అమెరికా, 15మంది యుఎన్‌ఎస్‌సి సభ్యులతో భద్రతా మండలిలో అధికారికంగా చర్చలు ప్రారంభించారు.

గురువారం ప్రకటించిన తీర్మానం ముసాయిదా గాజాకోసం మార్పు పాలక సంస్థ ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ను ఏర్పాటు చేయనుంది. 2027 వరకు అమల్లో ఉండనున్న ఈ కమిటీకి ట్రంప్‌ అధ్యక్షత వహిస్తారు. సరిహద్దు ప్రాంతాలను సురక్షితంగా ఉంచడానికి, గాజాను సైనికీకరించడంలో సహాయపడేందుకు ఇజ్రాయిల్‌, ఈజిప్ట్‌, కొత్తగా శిక్షణ పొందిన పాలస్తీనా పోలీసులతో కలిపి ‘తాత్కాలిక అంతర్జాతీయ స్థిరీకరణ దళం (ఐఎస్‌ఎఫ్‌)’ను ఏర్పాటు చేయడానికి సభ్యదేశాలకు అధికారం ఇస్తుంది.

ప్రస్తుతం పరిశీలనలో ఉన్న భద్రతామండలి తీర్మానానికి అమెరికా, ఖతార్‌, ఈజిప్ట్‌, సౌదీ అరేబియా, యుఎఇ, టర్కీ, ఇండోనేషియా, పాకిస్తాన్‌, జోర్డాన్‌లు తమ ఉమ్మడి మద్దతును వ్యక్తం చేస్తున్నట్లు శుక్రవారం ఆయా దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ చర్యను త్వరగా ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపాయి.

ఈ తీర్మానాన్ని నిరాకరించడమంటే హమాస్‌ పాలన కొనసాగడానికి లేదా ఇజ్రాయిల్‌తో తిరిగి యుద్ధం కొనసాగాలని ఓటు వేయడం, ఈ ప్రాంతాన్ని, ప్రజలను శాశ్వత సంఘర్షణకు గురిచేయడమేనని అమెరికా రాయబారి మైక్‌ వాల్ట్జ్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌లో స్పష్టం చేశారు.

గాజాలో శాంతిని స్థాపించే చొరవను స్వాగతిస్తున్నట్లు రష్యన్‌ యుఎన్‌ రాయబారి పేర్కొన్నారు. అయితే ఇజ్రాయిల్‌-పాలస్తీనా పరిష్కారానికి రెండు దేశాల ఏర్పాటు అనే సూత్రాన్ని గుర్తించడానికి బదులుగా ఈ ప్రతిపాదన భిన్నంగా ఉందని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు, ఈ నిబంధనలకు అమెరికా ముసాయిదా తగిన గౌరవం ఇవ్వలేదని చెప్పారు.