విశాఖ గో మాంసం అక్రమ రవాణా మూలాలు గుర్తించండి

విశాఖ గో మాంసం అక్రమ రవాణా మూలాలు గుర్తించండి

విశాఖ గో మాంసం అక్రమ నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  విశాఖ పోలీసులకు సూచించారు. గో మాంసం  నిల్వల వెనుక ఎవరున్నా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. విశాఖలో భారీగా గో మాంసం నిల్వలు పట్టుబడిన వ్యవహారంపై ఆరా తీశారు.  విశాఖ పోలీస్ కమిషర్ నుంచి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. 

అంత పెద్ద ఎత్తున గో మాంసం ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారు? ఎక్కడి నుంచి తెచ్చారు.. నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశాలపై పవన్ కళ్యాణ్ గారు విచారించారు.  కేసులో ఎంతటి వ్యక్తులు ఉండినా క్షమించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు. 

డీఆర్ఐ అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజీపై దాడి నిర్వహించి 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసును పోలీసులకు అప్పగించారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వహకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ పవన్ కల్యాణ్‌కు తెలిపారు. మాంసం ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తరలించాలనుకున్నారు?అనుమతుల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

తప్పిదం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్  మాట్లాడుతూ, అక్రమ గోవధ, గోమాంసం సరఫరా లేదా ఎగుమతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన తర్వాత పిఠాపురంలో ఉన్న అక్రమ వధశాలను గతంలో మూసివేయించిన ఉదాహరణను గుర్తుచేశారు. గోవధ నిషేధానికి ఎన్డీయే ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తుందని పేర్కొన్నారు.