ఢిల్లీ ఉగ్రకుట్రకు మాల్దీవులతో లింకులు!

ఢిల్లీ ఉగ్రకుట్రకు మాల్దీవులతో లింకులు!

ఢిల్లీ కారు బాంబు పేలుడు సూత్రధారి డా. షాహీన్ షాహిద్ సోదరుడు పర్వేజ్ అన్సారీ మూడేళ్లు మాల్దీవుల్లో ఉండి తిరిగి లఖ్నవూకు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. మాల్దీవుల్లోనే పర్వేజ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకున్నట్లు స్పష్టమైంది. 2018లో మాల్దీవులకు వెళ్లిన పర్వేజ్ అన్సారీ మళ్లీ 2021లో లఖ్నవూకు తిరిగి వచ్చాడు.

మాల్దీవుల్లోనే మూడేళ్లు ఉన్నాడు. అక్కడ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. ఆ తర్వాత తన సోదరి డాక్టర్ షాహీన్ పిలుపు మేరకు లఖ్నవూకు తిరిగి వచ్చాడు. షాహీన్ ఆదేశాల మేరకు జమ్ముకశ్మీర్కు వెళ్లాడు. అక్కడే రెండు నెలలు తన సోదరితో కలిసి ఉన్నాడు. జమ్ముకశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన సోదరి షాహీన్ కోసం స్లీపర్ సెల్గా పనిచేయడం ప్రారంభించాడు.

మాల్దీవులకు వెళ్లకముందు డాక్టర్ పర్వేజ్ అన్సారీ తన కుటుంబంతో కలిసి లఖ్నవూలోని లాల్ బాగ్ సమీపంలోని ఖండరి బజార్లోని ఇంట్లో ఉండేవాడు. మాల్దీవుల నుంచి తిరిగొచ్చాక అతడి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. మదియాన్వ్లో ప్రత్యేకంగా ఒక ఇల్లు నిర్మించుకుని అక్కడికి మకాం మార్చాడు.  ఇల్లు చిన్నది అయినప్పటికీ ఆ ఇంట్లో నుంచి పిల్లల అరుపులు లేదా కేరింతల శబ్దం బయటకి వినిపించేవి కావని స్థానికులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ పేలుళ్ల ఘటనలో నిందితురాలు డాక్టర్ షాహీన్, ఆమె సోదరుడు డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) అధీనంలో ఉన్నారు.  అయితే 2021లో లఖ్నవూ రాకముందు అన్సారీ మాల్దీవుల్లో మూడేళ్ల ఉన్నాడని అతడి ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైంది. అక్కడే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకున్నట్లు తేలింది.  డాక్టర్ పర్వేజ్ అన్సారీ మాల్దీవులలో పనిచేస్తున్నప్పుడు అతడికి ఉగ్రవాద సంస్థలతో పరిచయం ఏర్పడింది. 

భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఉగ్రవాద సంస్థల ఆదేశాల మేరకు పనిచేయడం ప్రారంభించాడు. అందుకు పర్వేజ్ సోదరి షాహీన్ సహాయం చేసింది. పర్వేజ్‌ ను ఉగ్రవాద సంస్థలలోని తన సహచరులతో కలవడానికి ఏర్పాటు చేసింది షాహీన్. ఈ విషయాలు పర్వేజ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాల నుండి డేటాను విశ్లేషించిన తర్వాత బయటపడింది.