అధికారంలోకి రావాలనుకున్న ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘఠ్‌బంధన్ కూటమి ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రాజకీయాలకు స్వస్తి పలికారుఆయన కుమార్తె రోహిణి ఆచార్య తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
అంతేకాదు, కుటంబంతో సంబంధాలను కూడా తెంచుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఆమె ఈ నిర్ణయానికి సంజయ్ యాదవ్, రమీజ్ అనే ఇద్దరిని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు ‘నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. అలాగే నేను నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ నన్ను చేయమని అడిగింది ఇదే’ అంటూ సంచలన ట్వీట్ చేశారు. సంజయ్ యాదవ్ ఆర్జేడీకి చెందిన రాజ్యసభ ఎంపీ. లాలూ కుమారుడు, ఆ పార్టీ వారసుడు తేజస్వి యాదవ్‌కు అత్యంత విశ్వసనీయ అనుచరుడు.
ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ కుటుంబానికి చెందిన తేజస్వి యాదవ్ పాత స్నేహితుడు రమీజ్. అయితే వీరిద్దరూ రోహిణి ఆచార్యకు ఏమి చెప్పారు అన్నది ఆమె పోస్ట్‌లో స్పష్టత లేదు. ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాభవం వేళ రోహిణి ఆచార్య ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. కాగా, రోహిణి ఆచార్య వృత్తీరీత్యా వైద్యురాలు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ ఇవ్వడంతో వార్తల్లో నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని సరన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
అయితే, బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమి తర్వాత కుటుంబ సభ్యులు లేదా పార్టీలోని కొందరు ఆమెను రాజకీయాల నుంచి తప్పుకోవాలని బలవంతం చేశారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. లాలూ కుటుంబం బీహార్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో వారసత్వం, పార్టీ వ్యూహాలపై అంతర్గత విభేదాలు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.
మహాకూటమి ఓటమికి, ముఖ్యంగా ఆర్జేడీ పరాజయానికి రోహిణిని బాధ్యురాలిగా చేస్తూ ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబంలో ఏర్పడిన అంతర్గత కలహాలకు ఇది పరాకాష్టగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దీనికి ముందు లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కూడా పార్టీ నుంచి, కుటుంబం నుంచి లాలూప్రసాద్ బహిష్కరించారు. దీంతో తేజ్ ప్రతాప్ సొంతంగా జన్‌శక్తి జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేసి బిహార్ ఎన్నికల్లో మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆయనతో పాటు పార్టీ నుంచి పోటీ చేసిన 22 మంది అభ్యర్థులు కూడా ఓటమిని చవిచూశారు.

More Stories
గిరిజన వర్గాల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
ఢిల్లీ ఉగ్రకుట్రకు మాల్దీవులతో లింకులు!
ఢిల్లీ ఉగ్ర పేలుడు వెనుక విస్తృతమైన వైద్యుల నెట్వర్క్