పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్‌కు తిరిగి రాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన 52 ఏళ్ల సరబ్‌జీత్ కౌర్, భర్త కర్నైల్ సింగ్ నుంచి విడాకులు తీసుకున్నది.
ఆమెకు ఇద్దరు కుమారులు. గురునానక్ దేవ్ 555వ జయంతిని పురస్కరించుకుని భారత్‌కు చెందిన 1,900 మందికి పైగా యాత్రికుల బృందం నవంబర్ 4న వాఘా-అట్టారి సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని చారిత్రక గురుద్వారాలను వారు సందర్శించి .నవంబర్ 13న ఈ బృందం భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే ఈ బృందంతో కలిసి వెళ్లిన సరబ్‌జీత్ కౌర్ పాకిస్థాన్‌లో అదృశ్యమైంది.
ఇమ్మిగ్రేషన్ ఎగ్జిట్ క్లియరెన్స్ కోసం రిపోర్ట్ చేయలేదని పాకిస్థాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఆమె మిస్సింగ్‌పై దర్యాప్తు చేశారు. కాగా, సరబ్‌జీత్ కౌర్ ఇస్లాం మతంలోకి మారి పాకిస్థాన్‌లోని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తన పేరును నూర్‌గా మార్చుకున్న ఆమె లాహోర్ సమీపంలోని షేక్‌పురాకు చెందిన నాసిర్ హుస్సేన్‌ను వివాహమాడింది. ఉర్దూలో ఉన్న ‘నిఖానామా’ (ఇస్లామిక్ వివాహ ఒప్పందం) కాపీ కూడా బయటపడింది.
మరోవైపు పాకిస్థాన్ పోలీసులు ఈ విషయాన్ని భారతీయ అధికారులకు తెలియజేశారు. దీంతో సరబ్‌జీత్ కౌర్, ఆమె కుటుంబం గురించి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లా నుంచి ఆమె పాస్‌పోర్ట్ పొందినట్లు గుర్తించారు. పాస్‌పోర్ట్‌లో మాజీ భర్త పేరుకు బదులు తండ్రి పేరు ఉన్నట్లు కనుగొన్నారు. మాజీ భర్త కర్నైల్ సింగ్ గత 30 ఏళ్లుగా బ్రిటన్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. పాక్‌లో అదృశ్యమై మతం మారి అక్కడి వ్యక్తిని పెళ్లాడిన సరబ్‌జీత్ కౌర్ గురించి మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
రాజ్యాంగ కోర్టు ఏర్పాటుతో పాక్ లో గందరగోళం
ట్రంప్ గాజా శాంతి ప్రణాళికపై ఐరాసలో సోమవారం ఓటు
మీకు ఎంతమంది భార్యలు?