విశాఖ వేదికగా జరిగిన 30వ సీఐఐ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలసికట్టుగా విజయవంతం చేశారని కొనియాడారు. 3 రోజులు కలిపి రూ.16 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు సాధించినట్లు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామని చెబుతూ సాధించిన పెట్టుబడులతో సరిపెట్టుకోకుండా రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నిర్ధేశించారు. 10 ఏళ్లలో 1 ట్రిలియన్ డాలర్లు, కోటి మందికి ఉద్యోగాలు తీసుకురావటమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
మెడ్ టెక్ పార్కులో ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు అవుతోందని వెల్లడించారు. శ్రీ సిటీలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటంతో పాటు 50 దేశాలకు చెందిన కంపెనీలు తేవాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదోక వినూత్నమైన పారిశ్రామిక అభివృద్ధి మోడల్ అన్న సీఎం పోటీ పడి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రాదని, ఎకోసిస్టం తయారైంది కాబట్టే మరో నాలుగైదు డేటా సెంటర్లు ఏర్పాటుకు ముందుకు వచ్చారని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోందని భరోసా ఇచ్చారు.
ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలు అన్నీ మూడన్నరేళ్లలో అమలుఅయ్యేలా లక్ష్యo నిర్ధేశించుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ఇదే తేదీల్లో మళ్లీ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ సిటీలో అదనంగా మరో 70 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్తులో పరిశ్రమల అధినేతల ఎటువంటి సమస్య రాకుండా ఎస్ క్రో అకౌంట్తో పాటు సావరిన్ పవర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో 2019-24 రాష్ట్రానికి చీకటి పాలన అని చంద్రబాబు ధ్వజమెత్తారు. పరిశ్రమల్ని ప్రోత్సహించకుంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో గత 5 ఏళ్లు చూశామని గుర్తు చేశారు. దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్దరిస్తున్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు పయణిస్తున్నామని వెల్లడించారు.
గత ప్రభుత్వ విధానాలు మరెప్పుడూ పునరావృతం కాకూడదనే ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామని ఇప్పటి వరకూ చేసుకున్న ఒప్పందాలు ద్వారా 25 లక్షల ఉద్యోగాల హామీ ఇస్తున్నామని తెలిపారు. 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 1130 మంది దేశీయ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారని, యూరప్, మెక్సికో, జపాన్, తైవాన్, ఇటలీ ఇలా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. అత్యధికంగా పర్యాటకంలో 112 ఒప్పందాలు జరిగాయని తెలిపారు.

More Stories
మహిళ + ఇ బి సి = బీహార్ సునామీ
గిరిజన వర్గాల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
విశాఖ గో మాంసం అక్రమ రవాణా మూలాలు గుర్తించండి