మీకు ఎంతమంది భార్యలు?

మీకు ఎంతమంది భార్యలు?
* సిరియా అధ్యక్షుడిని ప్రశ్నించిన ట్రంప్‌
 
సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరా అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో భేటీ అయ్యారు. అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో జరిగిన ఈ భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భేటీ సందర్భంగా సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ షరాకు ట్రంప్‌ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురి నేతల మద్య హృదయపూర్వక సంభాషణ జరిగింది.

భేటీ అనంతరం అల్‌ షరాకు ట్రంప్‌ పెర్ఫ్యూమ్ బాటిల్‌ ను బహుమతిగా అందించారు. ఇది చాలా మంచి సువాసన ఉంటుందని పేర్కొన్నారు.  ‘ఒకటి మీకు. ఇంకొకటి మీ భార్యకు’ అని చెప్పి రెండు బాటిల్స్‌ ఇచ్చారు. అదే సమయంలో సిరియా అధ్యక్షుడిని ట్రంప్‌ ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. ‘మీకు ఎంత మంది భార్యలు..? ఒక్కరేనా..? అని ప్రశ్నించారు. ఒక్కరే అని షరా బదులివ్వగా.. ‘అది నిజమా? నమ్మలేం..’ అంటూ ట్రంప్‌ సందేహం వ్యక్తం చేశారు.

ట్రంప్‌ మాటలతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఇందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా, రెండు దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న అహ్మద్‌ అల్‌-షరా అధ్యక్షుడి హోదాలో ఆ దేశంలో పర్యటించడం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 1946లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వాషింగ్టన్‌ను సందర్శించిన మొదటి అధ్యక్షుడు కూడా ఆయనే కావడం విశేషం.

అహ్మద్‌ అల్‌-షరా.. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడికి కొద్ది రోజులు ముందే అల్-ఖైదాలో చేరారు. ఇరాకీ తిరుగుబాటులో కూడా ఆయన పాల్గొన్నారు. దీంతో, అమెరికన్ సైన్యం ఆయన్ను 2006 నుంచి 2011 దాకా డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఆ తర్వాత సిరియాకు వెళ్లి అల్‌-ఖైదాకు మద్దతుగా ‘అల్‌ నుస్రా ఫ్రంట్‌’ను ఏర్పాటుచేశారు.

ప్రభుత్వ వ్యతిరేకత ఉద్ధృతంగా ఉన్న ఇడ్లిబ్ లాంటి ఏరియాల్లో శక్తివంతమైన నేతగా ఎదిగారు. అనంతరం క్రమంగా అల్‌-ఖైదాకు దూరమయ్యారు. వేలాది మంది తిరుగుబాటుదారులతో కలిసి 2017 మొదట్లో హయాత్‌ తహరీర్‌ అల్‌-షమ్‌ను స్థాపించారు. గత ఏడాది డిసెంబరులో ఆయన నాయకత్వంలోని తిరుగుబాటు దళాలు సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్‌ అసద్‌ సర్కారును గద్దెదించాయి.