బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాగఠ్‌బంధన్ ఘోర పరాజయం పాలైంది. అందులోనూ కాంగ్రెస్ పార్టీ దారుణాతిదారుణమైన ఫలితాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ ఎన్నికల ప్రచారానికి పార్టీ తనను ఆహ్వానించలేదని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తన ఓటమికిగల కారణాలను విశ్లేషించుకొని, లోపాలు ఎక్కడున్నాయో గమనించాలని సూచించారు. ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం సాధించినందున అందుకు గల కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలాంటి విషయాల్లో మొత్తం కూటమి పనితీరును పరిశీలించడం చాలా ముఖ్యమని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకొక గుణపాఠమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పని పేర్కొంటూ ఈ ఫలితాలు కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి మిత్రపక్షాలకు ఓ గుణపాఠం అని చెప్పారు. కాంగ్రెస్, ఇండియా కూటమి కోసం కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
మహిళా సాధికారత, స్వయం ఉపాధి కింద మహిళలకు రూ.10,000 చొప్పున జమ చేయడం, మహిళా ఓటర్ల పెరుగుదల ఎన్డీయే కూటమి గెలుపుకు కారణమని భావిస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా ఫలితాలు వచ్చాక కారణాలేమిటో తెలియాల్సి ఉందని శివకుమార్ చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ విజయం సాధించడం మహాగట్బంధన్కు పెద్ద ఎదురు దెబ్బ అని సిపిఎం పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. బిజెపిని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు మరింత సమైక్యంగా కృషి చేసి వుండాల్సిందని బీహార్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని తెలిపింది. .

More Stories
ముస్లిం నియోజకవర్గంలో బీజేపీ యువతి మైథిలీ గెలుపు
బీహార్ లో ఏకపక్షంగా 200 సీట్ల వైపు ఎన్డీయే ప్రభంజనం
భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి