బిజెపి మాజీ కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ సస్పెండ్

బిజెపి మాజీ కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ సస్పెండ్
 
* బీహార్ లో ఎమ్యెల్సీ, మేయర్ దంపతులు కూడా సస్పెండ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఒక రోజు తర్వాత, భారతీయ జనతా పార్టీ బీహార్‌లోని తిరుగుబాటుదారులపై కఠిన చర్య తీసుకుంది.  మాజీ కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్, మరో ఇద్దరు నాయకులను “పార్టీ వ్యతిరేక కార్యకలాపాల” కోసం సస్పెండ్ చేసింది.  నరేంద్ర మొదటి మొదటి ప్రభుత్వంలో విద్యుత్ మంత్రిగా, గతంలో కేంద్ర హోం కార్యదర్శిగా పనిచేసిన ఆర్.కె. సింగ్, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తీవ్రంగా గళమెత్తుతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుండి ఆయన బీహార్ ప్రభుత్వంతో పాటు ఎన్డీఏ నాయకత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.  మాజీ దౌత్యవేత్త అయిన సింగ్ 2013లో బిజెపిలో చేరారు. 2014,  2019లలో అర్రా నుండి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అవినీతి, ముఠాల ఆరోపణలపై అనేక మంది ఎన్డీఏ నాయకులను ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల సమస్యలను ఎన్నికల కమిషన్ నిర్వహించడాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా మోకామాలో జరిగిన హింసను పరిపాలన, ఎన్నికల కమిషన్ వైఫల్యంగా ఎత్తి చూపారు. పార్టీ కూడా ఒక షోకాజ్ నోటీసు జారీ చేస్తూ వారంలోపు వారిని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో వివరించాలని కోరింది.
 
“మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీ దీనిని తీవ్రంగా పరిగణించింది. ఇది పార్టీకి హాని కలిగించింది. అందువల్ల, నిర్దేశించినట్లుగా, మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాము.  మిమ్మల్ని పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో వివరించమని కోరారు. కాబట్టి, ఈ లేఖ అందిన వారంలోపు మీ వైఖరిని స్పష్టం చేయండి” అని బిజెపి సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొంది.
 
ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నాయకుడుగా మారిన అనంత్ సింగ్ వంటి ఎన్డీయేలోని కొంతమందితో సహా నేర నేపథ్యం ఉన్న అభ్యర్థులను తిరస్కరించాలని సింగ్ బీహార్ ఓటర్లను కోరారు. పార్టీ నాయకులపై నిష్కపట వైఖరి, ఆరోపణలు అతని దూరాన్ని మరింత పెంచాయి.  సింగ్ సస్పెన్షన్‌తో పాటు, బీహార్ బిజెపి ఎమ్యెల్సీ అశోక్ కుమార్ అగర్వాల్, ఆయన  భార్య కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌లను కూడా ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు’ అని పేర్కొంటూ సస్పెండ్ చేసింది. అశోక్ అగర్వాల్ వివాదాస్పదంగా తన కుమారుడు సౌరవ్ అగర్వాల్‌ను కతిహార్ నుండి విఐపి  అభ్యర్థిగా నిలబెట్టారు.