రాజకీయ అనాధలుగా బ్రిటన్ లో సిక్కులు

రాజకీయ అనాధలుగా బ్రిటన్ లో సిక్కులు
పి నవీన్, సీనియర్ జర్నలిస్ట్ 
 
వలస వ్యతిరేక వాదనలు, ప్రచారాల వల్ల  బ్రటన్‌లో నివసిస్తున్న దక్షిణాసియా వాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ముఖ్యంగా సిక్కు సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. ఒకప్పుడు సురక్షితం అనుకున్న దేశంలో ఉండలేమన్న ఆలోచనలు విస్తరిస్తున్నాయి.  పెరిగింది. చాలా మంది యూకే వదిలి వెళ్లాలని చూస్తున్నారు. మధ్య ఇంగ్లండ్‌లో సిక్కులపై వరుసగా దాడులు జరిగాయి. ఈ దాడులు హిందూ, ముస్లిం, సిక్కు వర్గాల్లో భయాన్ని నింపాయి. తదుపరి లక్ష్యం తామే కావచ్చని వారు భయపడుతున్నారు.

ఈ భయానికి రాజకీయ ప్రసంగాలే కారణం. వలసదారులను నిందిస్తూ సాగుతున్న ప్రచారం దాడులను పెంచుతోంది. ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ (గ్రేట్ బ్రిటన్) ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రాజకీయ నాయకుల వలస వ్యతిరేక ప్రసంగాల వల్లే నేరాలు పెరిగాయని ఆరోపించింది. ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు, దేశవ్యాప్తంగా 70,000 జాతి వివక్ష నేరాలు నమోదయ్యాయి.

గత 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనలో వలస వ్యతిరేక భావనలు పెరిగాయి. రాజకీయ నాయకులు, మీడియా ఈ ద్వేషాన్ని పెంచి పోషించారు. నిగెల్ ఫరాజ్ వంటి నేతలు దీనికి ఆజ్యం పోశారు. యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యుకెఐపి) వలసదారులకు వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేసింది.

ఐరోపా సమాఖ్య (ఈయు) నుండి వైదొలగాలన్న ‘బ్రెగ్జిట్’ ఉద్యమం కూడా ఇదే కోవకు చెందింది. తూర్పు ఐరోపా వలసదారులను తిప్పి పంపడమే వారి అసలు ఉద్దేశం. బ్రెగ్జిట్ విజయం ‘రిఫార్మ్’ పార్టీకి కొత్త ఊపునిచ్చింది. ఈ పార్టీకి కూడా ఫరాజ్ నాయకత్వం వహిస్తున్నారు.   ఈ రాజకీయ పరిణామాలు నియో-నాజీ గ్రూపులకు ధైర్యం ఇచ్చాయి. నేషనల్ ఫ్రంట్, ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ (ఈడిఎల్) వంటి సంస్థలు బలపడ్డాయి. ఇవి సమాజంలో విషం చిమ్ముతూ, వర్గాల మధ్య విభజన తెస్తున్నాయి.

సెప్టెంబర్ 12న లండన్‌లో ఈడిఎల్ ఒక భారీ ర్యాలీ నిర్వహించింది. ‘యునైట్ ది కింగ్‌డమ్’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ మైనారిటీలను వణికించింది. ఆశ్చర్యకరంగా, ఈ ర్యాలీకి సుమారు లక్షన్నర మంది హాజరయ్యారు. యూకే చరిత్రలో ఇదే అతిపెద్ద ఫార్-రైట్ ర్యాలీ. ఇది మైనారిటీ వర్గాల్లో తీవ్ర భయాందోళనలు నింపింది.

ఈ ర్యాలీకి కొద్ది రోజుల ముందే దాడులు మొదలయ్యాయి. బర్మింగ్‌హామ్‌లోని ఓల్డ్‌బరీ ప్రాంతంలో సెప్టెంబర్ 9న ఒక దారుణం జరిగింది. 20 ఏళ్ల సిక్కు యువతిపై లైంగిక దాడి, అత్యాచారం జరిగింది. దాడి చేసిన వారు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ముగ్గురు శ్వేతజాతీయులను అరెస్టు చేశారు. అక్టోబర్ 20న, 49 ఏళ్ల వ్యక్తి, 65 ఏళ్ల మహిళపై రెండు అత్యాచార అభియోగాలు మోపారు.

అక్టోబర్ 25న మరో సిక్కు యువతిపై వాల్‌సాల్‌లో దాడి జరిగింది. తనపై అత్యాచారం, దాడి జరిగిందని ఆమె ఆరోపించింది. ఈ కేసులో 32 ఏళ్ల జాన్ యాష్బీ అనే శ్వేతజాతీయుడిని అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారం, గొంతు నులమడం, మతపరమైన/జాతిపరమైన దాడి, దొంగతనం వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. ఈ రెండు ఘటనల మధ్య, వోల్వర్‌హాంప్టన్‌లో వృద్ధులైన సిక్కు టాక్సీ డ్రైవర్లపైనా దాడులు జరిగాయి.

9/11 దాడుల తర్వాత ఇస్లామోఫోబియా పెరిగింది. ముస్లింలపై ద్వేషం పెరిగింది. సిక్కులు ధరించే తలపాగల కారణంగా, వారిని ముస్లింలుగా పొరబడేవారు. వారిపై కూడా దాడులు జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

సిక్కు సమాజం మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. సిక్కులపై జరిగే దాడులను అధికారిక గణాంకాల్లో ప్రత్యేకంగా నమోదు చేయడం లేదు. వాటిని హిందూ లేదా భారతీయ కేటగిరీలలో కలుపుతున్నారు. దీనివల్ల సమస్య తీవ్రత బయటకు కనిపించడం లేదు. ముస్లింల తర్వాత అత్యధిక దాడులు తమపైనే జరుగుతున్నాయని సిక్కులు భావిస్తున్నారు. తమపై జరిగే నేరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సిక్కు ఫెడరేషన్, సిక్కు చట్టసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  

 
ఈ దాడులపై యూకే ప్రభుత్వం మౌనంగా ఉండటం సిక్కులను నిరాశపరిచింది. భారత ప్రభుత్వం కూడా తమ తరపున గట్టిగా మాట్లాడటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ రాజకీయ అనాథభావం, పెరిగిన హింస కారణంగానే సిక్కులు యూకేను వీడి వెళ్తున్నారు.